● పొదిలిలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్న ఇద్దరు నాయకులు
పొదిలి రూరల్: మార్కాపురం జిల్లా పొదిలిలో టీడీపీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఒక సమస్యపై మాట్లాడుకునే క్రమంలో విభేదాలు బయట పడ్డాయి. ఆదివారం పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ఆస్పత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథం కూడా ప్రారంభించారు. ఆ సమయంలో కొత్తపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నరేష్‌కు స్వచ్చ రథం ఎందుకు ఇచ్చారని మాదాలవారిపాలెం సొసైటీ అధ్యక్షుడు యర్రం వెంకటేశ్వరరెడ్డిని ఆ పార్టీ జిల్లా మైనార్టీ కార్యదర్శి షేక్ రసూల్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కందుల ఈ సమస్యపై తరువాత మాట్లాడామని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరు నాయకులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలి వానలా మారి గొడవకు దిగారు. అందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే బాహాబాహీ తలపడి ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఇరువురినీ తప్పించి సర్ది చెప్పి పంపించి వేశారు. దీంతో గొడవ సర్దుమణిగింది. ప్రజల సమక్షంలోనే ఇద్దరు నాయకులు గొడవ పడి కొట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు.


