ఒంగోలు సిటీ: ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి సంస్థ సిబ్బందితోనే నడపడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించవచ్చని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్ అన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, సొంత బస్సుల సంఖ్యను పెంచడం వంటి ప్రధాన డిమాండ్లతో నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిపోలను ఖాళీ చేయడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ ఆధీనంలో నడపించే చర్యలు ప్రజా రవాణా రంగానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షితమైన, చవకై న రవాణా సేవలు అందించే సామర్థ్యం కేవలం ఆర్టీసీకే ఉందని గుర్తు చేశారు. ఆర్టీసీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. డ్రైవర్, కండక్టర్, సాంకేతిక సిబ్బంది కొరతతో ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోందన్నారు. నెల్లూరు జోనల్ అధ్యక్షుడు బెజవాడ రవి మాట్లాడుతూ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వారికి అప్పగించే జీఓ నం. 88ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 3000 బస్సులు కొని 10,000 సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. డీఏ, పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పీఆర్‌సీ చైర్మన్‌ని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రచార కార్యదర్శి ఓ. రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి పోలయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎ. అదిశేషు, డిపో నాయకులు ఈ. సాయికృష్ణ, రెడ్డి, గ్యారేజీ కార్యదర్శి ఓ. పోలయ్య, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యుత్ బస్సులు ఆర్టీసీనే కొనుగోలు చేసి సిబ్బందితో నడపాలి
ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియర్
రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్


