స్థల వివాదంలో తోపులాట | - | Sakshi
Sakshi News home page

స్థల వివాదంలో తోపులాట

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

● పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంపై కన్నేసిన మూడు వర్గాలు ● గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు

పెద్దదోర్నాల: మండల పరిధిలోని కడపరాజుపల్లెలో ఓ స్థల వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ స్థలంపై కన్నేసిన గ్రామంలోని కొన్ని వర్గాలకు చెందిన వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఽరెండు వర్గాలకు చెందిన వారు శనివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే ఆదివారం మూడో వర్గానికి చెందిన మరి కొందరు పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో మాకూ హక్కు ఉందంటూ కొత్త వివాదానికి తెర తీశారు. దీంతో ఈ వివాదం గ్రామంలో తీవ్ర స్థాయికి చేరింది. దీంతో మూడు వర్గాలకు చెందిన వారు వారి వారి ఇలవేల్పులు, కుల దైవాల ఫొటోలను పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో పోటీలు పడి ఏర్పాటు చేసుకోవటంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారడంతో శనివారం తోపులాటకు దారితీసింది. ఈ వివాదంపై జోక్యం చేసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ. అజయ్‌కుమర్‌, ఎస్సై వెంకట రమణయ్యలు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థలంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల ఫొటోలను తొలగించారు. అనంతరం స్థలం ఎంపీపీ స్కూల్‌కు చెందిన స్థలంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలో ఏఎస్సై పోలురాజు ఆధ్వర్యంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement