భారం రూ. కోటి..! | - | Sakshi
Sakshi News home page

భారం రూ. కోటి..!

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

పెట్రోలు, డీజిల్‌ భారం తడిసి మోపెడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 5.72 లక్షల వాహనాలు వాటిలో పెట్రోలు వాహనాలు 4,16,500 డీజిల్‌ వాహనాలు 1,55,500 పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో జనం బెంబేలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రజలపై పెనుభారాన్ని మోపుతోంది. రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని శుక్రవారం ఉదయం నుంచే పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. దాంతో వాహనదారుల గుండెల్లో బాంబు పేలినంత పనయింది. పశ్చిమాశియాలో యుద్ధం కారణంగా క్రూడాయిల్‌ దిగుమతి మందగించడంతో ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంచడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాహనదారులపై ప్రతి రోజూ రూ.కోటికి పైగా భారం పడుతోంది. జిల్లాలో మొత్తం వాహనాలు 5.72 లక్షలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు 4.10 లక్షలు ఉన్నాయి. పెట్రోలు వాడే ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలు కలుపుకొని 6,500 వరకూ ఉన్నాయి. ఇకపోతే ఆటోలు జిల్లాలో 30,500, లారీలు 25,000, ట్రాక్టర్లు 13,000, కార్లు 25,000, ట్రావెల్స్‌ బస్సులు, స్కూలు, కాలేజీ బస్సులు, మినీ బస్సులతో పాటు ఇతర వాహనాలు మొత్తం కలిపి 1,55,500 ఉన్నాయి. ప్రతి రోజూ డీజిల్‌ భారం రూ.75 లక్షలు పడుతుండగా, పెట్రోలు భారం రూ.31 లక్షలు వరకూ ఉంది. అంటే మొత్తంగా పెట్రోలు, డీజిల్‌ భారం జిల్లా ప్రజలపై రోజుకు రూ.1.06 కోట్లు పడుతున్నట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి.

మహిళలకు ఫ్రీ బస్సుల దెబ్బ నుంచి కోలుకోకముందే....

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించటంతో ఆటోలు నడిపే చాలా మంది ఈ వృత్తి నుంచి మానుకున్నారు. మాలాంటి వాళ్లం వేరే వృత్తి చేతకాక ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇక ప్రస్తుతం పెరిగిన డీజిల్‌ ధరతో ఆటో ద్వారా జీవించాలంటే కష్టంగా మారనుంది. ప్రతి రోజూ నాగులుప్పలపాడు నుంచి ఒంగోలుతో పాటు ఇతర ప్రాంతాలకు ప్యాసింజర్లను రవాణా చేస్తుంటాను. చార్జీ పెంచితే ప్రయాణికులు ఊరుకోరు. పెంచకపోతే గిట్టుబాటు కాదు. ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నాం.

– కన్నెదారి అజయ్‌, ఆటో డ్రైవర్‌, నాగులుప్పలపాడు

డీజిల్‌ పెరగటంతో జీవనం గగనంగా మారింది

ఉన్నట్లుండి డీజిల్‌ పెరగటంతో జీవనం గగనంగా మారింది. ఇప్పటికే ఉన్న ధరలతో ఒంగోలులో ఆటో నడపాలంటేనే చాలా కష్టంగా మారింది. సర్వీసు రూ.20 అంటేనే చాలా ఎక్కువగా ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రతి రోజూ రూ.500లకు డీజిల్‌ కొట్టిస్తే ఆయిల్‌ ఖర్చులు పోను కనీసం రూ.300 మిగలటం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం పెరిగిన డీజిల్‌ ధరతో వృత్తిని కొనసాగించటం చాలా కష్టం. ఇక ఆటో రిపేరు వచ్చిందంటే ఆరోజు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే ఒంగోలు నగరంలో దాదాపు 2 వేల ఆటోలు వరకూ ఆపేశారు.

– చల్లాపల్లి సురేష్‌ బాబు, ఆటో డ్రైవర్‌, ఒంగోలు

Advertisement
 
Advertisement
Advertisement