భూ తగాదాలో ఒకరు దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలో ఒకరు దారుణ హత్య

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

సీఎస్‌పురం(పామూరు): భూ వివాదం విషయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం సీఎస్‌పురం మండలంలోని పెద్దగోగులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ హత్య అనంతరం భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, మృతుని తండ్రి కథనం మేరకు.. గోగులపల్లి గ్రామ సమీపంలో సర్వే నంబర్‌ 362/2లో 4 ఎకరాల భూమికి సంబంధించి మిరియం వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన చిలంకూరి రమేష్‌రెడ్డి మధ్య వివాదం తలెత్తగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల వద్ద పంచాయితీ పెట్టి చర్చించారు. కాగా, గురు, శుక్రవారాల్లో చిలంకూరి రమేష్‌రెడ్డి సదరు పొలంలో పని చేయిస్తుండగా మిరియం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు బాబు పనులను అడ్డుకున్నారు. కోర్టులో కేసు ఉండగా పనులు చేయడం సరికాదని చెప్పి ఇంటికొచ్చారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం మిరియం వెంకటేశ్వర్లు తన పొలానికి బైక్‌పై రమేష్‌రెడ్డి ఇంటి మీదుగా వెళ్తుండగా రమేష్‌రెడ్డి మడ్డుకత్తితో దాడికి యత్నించాడు. వెంకటేశ్వర్లు తృటిలో తప్పించుకోగా గొంతు వద్ద స్వల్ప గాయమైంది. రమేష్‌రెడ్డి, అతనితోపాటు ఉన్న కొటాలుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడి గురించి కుమారుడు బాబుకు తెలియజేయడంతో బైక్‌పై భార్గవ్‌ అనే యువకుడితో కలిసి ఊళ్లోకి వస్తున్నాడు. రోడ్డు వైపు వెళ్తున్న రమేష్‌రెడ్డి బృందానికి బాబు ఎదురపడగా అక్కడే నిలువరించారు. కొటాలుపల్లెకు చెందిన వ్యక్తులు బాబును బంధించగా రమేష్‌రెడ్డి కత్తితో గొంతు, చాతీ మధ్య పొడిచాడు. దీంతో బాబు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. బాబుతో బైక్‌పై వచ్చిన యువకుడు భయాందోళనకు గురై కేకలు వేసి సమీపంలోని వారిని పిలిచాడు. బాబును కారులో పామూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతునికి భార్య అనసూయ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు వ్యవసాయం చేస్తుంగా, నిందితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు.

సంఘటన స్థలాన్ని పామూరు సీఐ దుర్గాసి వినోద్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎస్సై కట్టా అనూక్‌ పరిశీలించారు. పామూరు సీహెచ్‌సీలో మృతుడి తండ్రి, క్షతగాత్రుడు మిరియం వెంకటేశ్వర్లుకు ప్రథమ చికిత్స అందించారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జెడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీ పరామర్శ

మిరియం బాబు మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, స్థానిక జెడ్పీటీసీ మేకల శ్రీనివాసయాదవ్‌, వైస్‌ ఎంపీపీ దుగ్గిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పలువురు వైద్యశాలకు చేరుకున్నారు. బాబు మృతదేహాన్ని పరిశీలించి, మృతుని తండ్రి వెంకటేశ్వర్లును పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సీఎస్‌పురం మండలం గోగులపల్లి గ్రామంలో ఘటన

హత్యానంతరం గ్రామంలో భయానక వాతావరణం

Advertisement
 
Advertisement
Advertisement