అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

ఓటర్ల జాబితా సవరణపై

మార్కాపురం: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)పై వైఎస్సార్‌ సీపీ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు. శుక్రవారం పట్టణంలోని విహారి లాడ్జిలో మార్కాపురం పట్టణ, రూరల్‌, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్‌, రూరల్‌ మండలాల వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ శ్రేణులందరికీ స్వగ్రామంలో ఓటు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉంటే వారి ఓటును స్వగ్రామంలో మాత్రమే ఉండేలా చూడాలన్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లను అధికార పార్టీ వారు కావాలని తొలగించే అవకాశం ఉందని, అటువంటి వాటిని గుర్తించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేద్దామని, మళ్లీ ఓటుహక్కు కల్పించేందుకు పోరాడుదామని చెప్పారు. బీఎల్‌ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 2002లో ఓటర్ల రివిజన్‌ జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. 2002, 2025 ఓటర్ల జాబితాను పరిశీలించి రివిజన్‌ చేస్తారన్నారు. ప్రతి ఓటరూ ఎన్యుమరేషన్‌ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్‌ఓలకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్‌ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తేవాలని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. మార్పులు, చేర్పులు, మరణించిన వారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

రాష్ట్ర కార్యదర్శి జోనల్‌ ఇన్‌చార్జి పుత్తా శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌తో యూపీలో 2.85 కోట్ల మంది, మధ్య ప్రదేశ్‌లో 34 లక్షలు, గుజరాత్‌లో 68 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 91, తమిళనాడులో 74 లక్షల మంది ఓటర్లను తొలగించారన్నారు. ముందుగా ఓటర్‌ డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేస్తారని, దానిని గమనించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల అధికారికి ఇవ్వాలన్నారు. ఓటర్‌ మ్యాపింగ్‌ ప్రకారం రివిజన్‌ జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాను దగ్గరపెట్టుకోవాలని, నిశితంగా పరిశీలించాలని, తొలగించిన ఓటర్లలో మరణించిన వారివి కాకుండా ఇతరుల ఓట్లు ఎవరైనా ఉన్నాయేమో బీఎల్‌ఏలు పరిశీలించాలని సూచించారు.

కార్యక్రమంలో అన్నా కృష్ణచైతన్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు షంషేర్‌ ఆలీబేగ్‌, కేవీ రమణారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పత్తి రవిచంద్ర నియోజకవర్గంలోని ఆయా మండలాల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు సలీమ్‌, చెంచిరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కాశయ్య, సోషల్‌ మీడియా అధ్యక్షుడు రఫీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యంరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుత్తా శివశంకర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

వైఎస్సార్‌ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు

మార్కాపురం నియోజకవర్గ బీఎల్‌ఏలకు అవగాహన

హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్‌ ఇన్‌ఛార్జి పుత్తా శివశంకర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement