2 ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగ చోరీ | - | Sakshi
Sakshi News home page

2 ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగ చోరీ

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

2 ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగ చోరీ 236 వాహనాలు సీజ్‌

తాళ్లూరు: పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి రాగితీగ చోరీ చేసిన సంఘటన తాళ్లూరు మండంలోని నాగంబొట్లపాలెం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రైతులు సోము వెంకట నరసింహారెడ్డి, కె.పిచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, నగేష్‌ తమ వ్యవసాయ బోర్ల కోసం ఏర్పాటు చేసుకున్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు 20 ఎకరాల్లో పశుగ్రాసం, వరి నారు సాగు చేశామని, ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ కావడంతో పంటలు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీపై పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

అర్ధరాత్రి బైకులపై చక్కర్లు కొడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక

ఒంగోలు సిటీ: ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో నైట్‌ పెట్రోలింగ్‌ ముమ్మరం చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. రాత్రి సమయంలో అనవసరంగా, అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 780 వాహనాలు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 103 వాహనాలు, అలాగే మార్కాపురం జిల్లాలో 552 వాహనాలు తనిఖీ చేసి 133 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఈ–చలానా విధించినట్లు చెప్పారు. రాత్రి వేళ 11 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, చెడునడత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు. నేరాల నియంత్రణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement