పొగాకు రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులను ఆదుకోవాలి

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

పొగాకు రైతులను ఆదుకోవాలి

మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్లు కేటాయించి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, మార్కాపురం ఇన్‌చార్జి అన్నా డిమాండ్‌ పొదిలి పొగాకు వేలం కేంద్రం సందర్శన

వేలం అధికారితో మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, నాయకులు

వేలం తీరును పరిశీలిస్తున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అన్నా రాంబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులు

పొదిలి:

ష్టకష్టాలకోర్చి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విమర్శించారు. పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబుతో కలిసి గురువారం పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని బూచేపల్లి సందర్శించారు. రైతులు, వేలం కేంద్రం అధికారులతో మాట్లాడారు. మార్కెట్‌ పరిస్థితి, పొగాకు నాణ్యత గురించి వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తక్షణమే మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్లు కేటాయించి పోటీ మార్కెట్‌ చేయించి పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వేలంలో సుమారు 60 శాతం మేర నోబిడ్‌ బేళ్లను రైతులు తిరిగి తీసుకెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. వేలం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు. గత సంవత్సరం పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని బూచేపల్లి గుర్తు చేశారు. ఆ సమయంలో రైతుల నుంచి జగన్‌కు లభించిన ఆదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం.. రైతులపై, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడంపై ఉన్న శ్రద్ధ పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ధరలు లేవని రైతులు చేస్తున్న ఆందోళనలను కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. పొగాకు బేళ్లు తగలబెడుతున్నా, వేలం ఆపి రోడ్డు మీదకు వస్తున్నా.. రైతుల వైపే ప్రభుత్వం చూడటం లేదన్నారు. పొగాకు కొనుగోలు చేసే వ్యాపారులకు రైతుల బాగోగులతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తారని, కానీ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించడం సరికాదని, తప్పనిసరిగా రైతులను ఆదుకోవాల్సిందేనని అన్నారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

క్వింటా రూ.36 వేలకు కొనుగోలు...

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో క్వింటా పొగాకును రూ.36 వేలకు కొనుగోలు చేశారని, కానీ, ఇప్పుడు రూ.22 వేలకు కూడా ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని బూచేపల్లి శివప్రసాదరెడ్డి నిలదీశారు. బ్యారన్‌కు రూ.5 లక్షల మేరకు రైతులకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కూలీలకు కూడా రైతులు డబ్బులిచ్చే పరిస్థితి లేదన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాబు ధర లేదని మండిపడ్డారు.

రైతులకు అండగా ఉంటాం :

అన్నా రాంబాబు

వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు మాట్లాడుతూ నీటిని రవాణా చేసి మరీ పొగాకుకు నీటి తడులు అందించి రైతులు ఎంతో కష్టపడి పొగాకు పండించారన్నారు. కానీ, పొగాకును గిట్టుబాటు ధరకు వేగంగా కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదని పలువురు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు ధర పెంచే పరిస్థితి లేదన్నారు. ఈ సమయంలో ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల పొగాకును అధిక ధరకు కొనుగోలు చేయించాలన్నారు. రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొనకనమిట్ల ఎంపీపీ ఎం.మురళి, జెడ్పీటీసీ సభ్యుడు అక్కిదాసరి ఏడుకొండలు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డి, నాయకుడు మోరా శంకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యక్కలి శేషగిరిరావు, రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆవుల వెంకట సుబ్బారెడ్డి, కొండ్రగుంట శ్రీనివాసరావు, దొరిశల సుబ్బారెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, ఫిరోజ్‌, పార్టీ నాయకులు ఆనికాళ్ల ఈశ్వరరెడ్డి, కొత్తపులి బ్రహ్మారెడ్డి, రైతు విభాగం నాయకుడు బీరం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement