కందుకూరు:
గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం(వీబీ–జీరామ్ జీ)లో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కూలీలకు మంజూరు చేసే సొమ్ముతోపాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనుల్లో అందినకాడికి దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ సొమ్మును అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది వాటాలేసుకుని ఆరగిస్తున్న తీరు చర్చనీయాంశమైంది.
సాంకేతికతా.. చట్టుబండలా?
ఉపాధీ హామీ పథకంలో అవినీతిని అరికట్టేందుకు నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినా అక్రమాలను అడ్డుకోలేకపోతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లుగా టీడీపీ కార్యకర్తలను నియమించుకుని అక్రమాలకు తెరతీశారు. కందుకూరు ప్రాంతంలో అడ్డగోలుగా చేపట్టిన పనులే అందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, రోడ్లు, కాల్వలు అభివృద్ధి చేయకుండానే చేసినట్లు చూయించడంతో నివ్వెరపోవడం ప్రజల వంతయింది. కందుకూరు మండల పరిధిలో 167–బి జాతీయ రహదారి మార్జిన్‌లో జేసీబీలతో పనులు చేసిన కాల్వల్లో మళ్లీ కూలీలతో పని చేయించినట్లు చూపారు. మహదేవపురం పంచాయతీ పరిధిలోని ఓవీ రోడ్డులో సీటీఆర్‌ఐ సమీపంలో ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో పనులు చేశారు. అదే ప్రాంతంలో ఇటీవల కూలీలతో తూతూ మంత్రంగా పనులు చేయించారు. అలాగే ఓగూరు గ్రామం నుంచి కోల్డ్‌స్టోరేజ్ వరకు జాతీయ రహదారి పక్కన చేసిన పనులదీ ఇదే పరిస్థితి. ఇలా అనేక గ్రామాల్లో పనులు చేసినట్లు నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నారు. దీంతో పథకం కింద అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు ఖర్చవుతున్నాయి కానీ ఫలితం మాత్రం శూన్యం.
గ్రామాల్లో లేనివారి పేర్లతో మస్తర్
ఉపాధీ హామీ పథకంలో దొంగ మస్తర్లను అరికట్టేందుకు కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. పని ప్రదేశం నుంచి కూలీల ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించారు. అయితే దొంగ మస్తర్లు వేసే వారికి ఇవేవీ అడ్డురావడం లేదు. గ్రామంలో ఏనాడూ లేని వారి పేర్లతో మస్తర్లు వేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల పేర్లను జాబ్‌కార్డుల్లో నమోదు చేసి వారి ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. నూతన సాంకేతికత అద్భుతంగా పని చేస్తుంటే ఇలా హాజరు వేయడం ఎలా సాధ్యపడుతోందనేది మిలియన్ డాటర్ల ప్రశ్నగా మిగిలింది. లింగసముద్రం మండలం వెంగళాపురం పంచాయతీ పరిధిలో కళ్యాణ్‌రామ్ అనే విద్యార్థి గుడ్లవల్లేరులోని కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ప్రస్తుతం అతను కాలేజీలోనే ఉన్నాడు. కానీ బుధవారం వేసిన మస్తర్‌లో మాత్రం అతని పేరు, ఫొటో నమోదు చేశారు. అలాగే నందిని అనే ఇంటర్ విద్యార్థిని అసలు పనికే వెళ్లదు. కానీ ఆమె పేరు మస్తర్‌లో ఉంది. కందుకూరు మండలంలోని పాలూరు దొండపాడు గ్రామంలో పలువురు కూలీలు ఏ రోజూ పనికి వెళ్లిన పాపాన పోలేదని, గ్రామంలో చిల్లరకొట్టు నిర్వహిహించుకుంటున్న వారి పేర్లను రోజూ మస్తర్‌లో నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. అయినా సరే ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులకు ఇవేవీ కనిపించవు. పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో అడ్డగోలుగా
సాగుతున్న పనులు
పనులకు హాజరు కాని, నగరాల్లో
ఉంటున్న వారి పేర్లపై దొంగ మస్తర్లు
పనులకు హాజరైన వారికి కూలి ఇవ్వాలంటే లంచం ముట్టజెప్పాల్సిందే
అవినీతి బయటపడకుండా చోటా లీడర్లు,
అధికారులు కుమ్మక్కు
ఉపాధి హామీ పథకంలో వెలుగు చూస్తున్న అవినీతి విచిత్రాలు


