అద్దంకి: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 14న ప్రారంభమైన హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, పూర్ణాహుతి, మండప దేవతా పూజలు, హోమం, పూర్ణాహుతి, బలిహరణ, మండపోద్వాసన పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ పాలకమండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్‌రావు, పాలకమండలి సభ్యులు, ఏసీ తిమ్మానాయుడు పర్యవేక్షించారు.
యర్రగొండపాలెం/అద్దంకి: చిన్న వయసులోనే సుగర్ వ్యాధి బారినపడి చావుబతుకుల మధ్య ఉన్న పసిబిడ్డల వైద్యానికి తమ వంతు సాయమందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్ల ఆరోగ్య పరిస్థితిపై శ్రీఆదుకోండయ్యా.. ఈ పసి బిడ్డలను..శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో గురువారం ప్రచురితమైన కథనానికి గురువారం పలువురు దాతలు స్పందించారు. అద్దంకి మండలంలోని శింగరకొండ ప్రసన్నాజనేయస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిన్ని శ్రీమన్నారాయణ రూ.5 వేలు అందజేశారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన దాతలు మరో రూ.25 వేలు బాధిత కుటుంబం బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసినట్లు ఆ పసిబిడ్డల బంధువులు తెలిపారు.
తాళ్లూరు: మిద్దె ఎక్కుతూ ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కాలుజారి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం..మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన యర్రగొర్ల ఆంజనేయులు మూడు రోజుల క్రితం మాధవరంలో బంధువుల దేవర కొలుపులకు వెళ్లాడు. కొలుపుల్లో భాగంగా మూడో రోజు ఆదివారం బంధువులు భోజనాలు మిద్దైపె ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెట్లు ఎక్కుతుండగా కాలుజారి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
● రూ.5 లక్షల విలువైన రొయ్యలు మృత్యువాత
కొత్తపట్నం: రొయ్యల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు పోయడంతో రొయ్యలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన కొత్తపట్నం సమీపంలోని బకింగ్ హామ్ బ్రిడ్జి పక్కన జరిగింది. వివరాల్లోకి వెళితే..కొత్తపట్నం గ్రామానికి చెందిన పురిణి కోటయ్య నెల రోజుల క్రితం ఎకరా చెరువును కౌలుకు తీసుకొని రొయ్యలు సాగు చేశాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు డబ్బాను చెరువులో వేశారు. గురువారం కోటయ్య చెరువు వద్దకు వెళ్లి చూడగా రొయ్య పిల్లలన్నీ పైకి తేలి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రొయ్య పిల్లల కొనుగోలు, బ్లీచింగ్, మందులు, విద్యుత్ బిల్లులు కలుపుకొని రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, మొత్తం నష్టపోయాయని కన్నీరు మున్నీరుగా విలపించాడు.


