డామిట్‌.. కథ అడ్డం తిరిగింది | - | Sakshi
Sakshi News home page

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

కురిచేడు: పెళ్లికి హాజరైన యువకుడు చేతివాటం ప్రదర్శించి నగదు, బంగారతో ఉడాయించాడు. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో డామిట్‌ కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. యోహోషువా అనే యువకుడు యువకుడు త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభాకార్యానికి హాజరయ్యారు. అక్కడ రూ.4 లక్షల నగదు, బంగారంతో ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. దారిన పోయే వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది మహబూబ్‌ బాషా, నరేష్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అక్కడే అసలు కథ మొదలైంది. క్షతగాత్రుడి తన పేరు యోహోషువా అని, తనది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి అక్కడ స్థిరపడ్డామని 108కి సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తాను తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లి వస్తున్నట్లు తెలిపాడు. కానీ కాటంవారిపల్లె గ్రామ చరిత్రలో ఆ పేరు ఉన్న కుటుంబం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో క్షతగాత్రుడు కావాలనే అబద్ధం చెబుతున్నట్లు గ్రహించిన 108 సిబ్బంది అతని వద్ద ఉన్న ఫోన్‌లో నంబర్‌ తీసుకొని అతని భార్యకు సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకొని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, అక్కడ నుంచి వాటిని తెచ్చాడని తెలిపింది. అతను త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ఫోన్‌నంబరు సిగ్నల్‌ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరారు. 108 సిబ్బంది ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలు పోలీసులకు అప్పగించి క్షత గాత్రుడిని మెరుగైన వైద్యం నిమిత్తం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు.

రోడ్డు ప్రమాదంతో

చోరీ విషయం వెలుగులోకి

Advertisement
 
Advertisement
Advertisement