ఒంగోలు టౌన్: ఒంగోలులో హత్యకు గురైన దివ్యాంగురాలు, ఇరిగేషన్ శాఖ ఉద్యోగి మోరేపల్లి ఆదిలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. భర్త వరప్రసాద్ స్వగ్రామమైన త్రిపురాంతకం మండలం మిల్లంపల్లి గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణ కోసం మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటన అనంతరం నిందితుడు వెంకటరమణ సీఎస్‌పురం మండలం బొంతువారిపల్లికి వెళ్లి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితురాలి భర్త వరప్రసాద్ నుంచి నిందితుడికి సంబంధించిన వివరాలు సేకరించి వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఒంగోలులోని శ్రీరామ లాడ్జిలో ఆదిలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆదిలక్ష్మి హత్య ఘటనపై దివ్యాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒంగోలులో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో రిమ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీఆదిలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలిశ్రీ, శ్రీహంతకుడిని వెంటనే పట్టుకోవాలిశ్రీ అంటూ నినాదాలు చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించిన అనంతరం అంధుల సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగ మహిళను దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆదిలక్ష్మి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కుమారునికి పూర్తి స్థాయిలో ఆర్థిక, విద్యా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్‌పీడీ చట్టం–2016ను పటిష్టంగా అమలు చేసి దివ్యాంగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని దివ్యాంగుల సంఘాలు పేర్కొన్నాయి.


