పేదింటికి పెద్ద కష్టం | - | Sakshi
Sakshi News home page

పేదింటికి పెద్ద కష్టం

Apr 29 2026 8:18 AM | Updated on Apr 29 2026 8:18 AM

మర్రిపూడి: ప్రాణాంతక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని దాతల సాయం కోసం ఓ పేద బాలిక ఎదురు చూస్తోంది. పదో తరగతి వరకు విద్యా సాఫీగా సాగినా ఇంటర్‌ కోసం ఇతర ప్రాంతాల్లో చేరడంతో విద్యను అభ్యసించే క్రమంలో రెండు మూత్రపిండాలూ ఒక్కసారిగా పాడయ్యాయి. అనారోగ్యంతో అల్లాడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు మొక్కని దేవుడంటూ లేడు. తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేందుకు దాతలు ముందుకు రావాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కొండపి ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కోరుతున్నారు. ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అక్కడికి వెళ్లి బాలికను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి అమూల్య ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చారు. తనలా మరికొందరు ముందుకొచ్చి ఆ చిన్నారి ప్రాణాలు నిలపాలని ఆదిమూలపు సురేష్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

సాయం కోసం వేడుకోలు

మర్రిపూడి మండలం గుండ్లసముద్రం పంచాయతీ కోష్టాలపల్లికి చెందిన చిరుపల్లి రామయ్య, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆ కుటుంబం కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వ్యవసాయం చేసినా అప్పులే మిగిలాయి.పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. రెండో కుమార్తె అమూల్య 10వ తరగతి ఉతీర్ణురాలయ్యాక పొదిలికి సమీపంలోని జువ్వలేరు ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో అమూల్య అనారోగ్యం పాలైంది. 5 నెలల క్రితం ఒంగోలు వైద్యశాలలో పరీక్షలు చేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయని వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు సూచన మేరకు ప్రస్తుతం ఒంగోలు వైద్యశాలలో డయాలసిస్‌ చేయించుకుంటోంది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, కూలి పనులకు వెళ్తున్న తల్లి.. బిడ్డకు ఇప్పటి వరకు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశారు. భూమి కౌలుకు తీసుకుని చేసిన వ్యవసాయం రూ.7 లక్షల అప్పు మిగిల్చింది. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు.

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని

డయాలసిస్‌ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న బాలిక

అమూల్యను పరామర్శించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Advertisement
 
Advertisement
Advertisement