లేబర్ కోడ్‌పై గర్జించిన ఏఐటీయూసీ కనిగిరిలో హోరెత్తిన ఏఐటీయూసీ తొలి జిల్లా మహాసభ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకళిద్దాం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ పిలుపు
కనిగిరిరూరల్: మార్కాపురంలో జిల్లా ఏర్పడిన తర్వాత ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభ బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. సంఘటిత, అసంఘటి కార్మికులు, వివిధ కార్మిక సంఘాలు సమైక్యతను చాటుతూ కష్టజీవుల జెండాలను చేతబూని పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. స్థానిక పీవీఆర్ పార్క్ వద్ద నుంచి శ్రమజీవులు, కార్మికులు, కర్షకులు, ఎర్ర జెండాలను చేతబూని స్థానిక షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏఐటీయూసీ జెండాను సీపీఐ సీనియర్ నాయకుడు అందే నాసరయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసీన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధక్షుడు ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ శ్రమ జీవుల పరిరక్షణకు, కార్మికుల హక్కుల సాధనకు ఏఐటీయూసీ నిరంతర పోరాటాలు సాగిస్తోందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకళించేందుకు కార్మిక లోకం సంసిద్ధం కావాలన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ, కార్మిక వర్గాలు ఇప్పటి వరకు కార్మిక సంక్షేమ పోరాటాలు సాగించాయని.. ఇక ఇప్పటి నుంచి కార్మిక వర్గాలు రాజకీయ పోరాటాలకు సంసిద్ధులు కానున్నట్లు వెల్లడించారు. అందుకు రానున్న రాష్ట్ర, ఆల్ ఇండియా కార్మిక సభల్లో అన్ని కార్మిక సంఘాలతో సమష్టి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ పోరాటాలతో కార్మికుల హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. కార్మిక చట్టాలను, హక్కులను కూటమి సర్కార్ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కూటమి నేతలకు కార్మిక సత్తా చూపించేందుకు సమాయత్తం కావాలన్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి సర్కార్‌లో అన్ని వర్గాలకు అన్యాయం
కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల పేరుతో రూ.కోట్ల విలువ చేసే భూములను కార్పొరేట్ వ్యాపారులకు, బడాబాబులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, యువత ఉద్యోగం, ప్రజా సంక్షేమం ఇలా అన్నింటినీ గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు. పీపీపీ విధానం పేరుతో పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రకు చంద్రబాబు తెర లేపారని విమర్శించారు. వెనుకబడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి కనీస చర్యలు లేవని, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతూ..కాకమ్మ కబుర్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా నాయకులు వై రవీంద్రబాబు, రమేష్ బాబు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్‌డీ మౌలాలి, కృష్ణ గౌడ్, మస్తాన్‌రావు, ఎస్‌కే ఖాశింపీరా మాట్లాడారు. కార్యక్రమంలో కార్మిక, వివిధ సంఘాల నాయకులు పందిటి మోహన్, జీపీ రామారావు, ఎస్‌కే గులాం హుస్సేన్, పీ ప్రభాకర్‌రావు, దాసరి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
– ఎంఎల్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి


