సంతమాగులూరు (అద్దంకి): ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు మనస్తాపం చెంది బుధవారం ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన గుంజి నాగేంద్రం కుమారుడు నవీన్ (27) కొంతకాలంగా మండలంలోని కుందుర్రులో నివాసం ఉంటూ చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం దక్కక పోవడంపై తీవ్ర నిరాశకు గురై ఎలుకల మందు తిన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని అద్దంకిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దొనకొండ: వెళ్తున్న రైలు నుండి ప్రయాణికుడు జారిపడి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే ఏఎస్‌ఐ వీరాంజనేయులు కథనం ప్రకారం.. మండలంలోని తెల్లబాడు పంచాయతీ నల్లబోతులవారిపాలెం గ్రామానికి చెందిన పోకూరి శ్రీనివాసరావు రైలు నుంచి జారి కింద పడ్డాడు. రైల్వే సిబ్బంది గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. దర్శి 108 సిబ్బంది ఈఎంటీ ఎన్.ప్రసాద్, పైలట్ కె.నరేష్‌బాబు హుటాహుటిన రైల్వేట్రాక్ గుట్టమీదపల్లె వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని ప్రథమ చికిత్స కోసం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారని ఏఎస్‌ఐ తెలిపారు.
తాళ్లూరు: మండలంలో అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు రవిబాబు, రాఘవరావులు తమ సిబ్బందితో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూర్పుగంగవరంలో పాదర్తి కుమార్‌రాజా వద్ద 16 డొమెస్టిక్ సిలిండర్లు, ఐదు కమర్షియల్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి తాళ్లూరు మంగ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి అప్పజెప్పారు. నిందితుడిని ఒంగోలు జాయింట్ కలెక్టర్ కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై నాగేశ్వరరావు, డిటి రాధాకృష్ణ పాల్గొన్నారు.
సంతమాగులూరు (అద్దంకి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కర్నూలు–గుంటూరు రహదారిపై పాతమగులూరు వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన విమరాల ప్రకారం.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం ముత్తునపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మం (53) టీవీఎస్ వాహనంపై వినుకొండ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య హనుమాయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.


