మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మోక్షమెప్పుడో?

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కంభం కోర్టుకు మోక్షమెప్పుడో?

కంభం కోర్టుకు

కంభం:

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 96 న్యాయస్థానాలను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ కేడర్‌లో 7 న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా, కంభంలో కోర్టు ఏర్పాటు కానుందని ఆశించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్ర నిరాశే మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. కంభంలో కోర్టు లేకపోవడంతో బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాల ప్రజలు వ్యయ ప్రయాసలలోర్చి మార్కాపురం, గిద్దలూరులోని న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తోంది. నవాబుల కాలంలోనే కంభంలో ఏర్పాటైన కోర్టు, ఆ తర్వాత బ్రిటిష్‌ హయాం, అలాగే స్వాతంత్య్రం అనంతరం కొంతకాలం వరకు కొనసాగింది. ఆనాటి పాలకులు స్థానిక పరిస్థితుల కారణంగా కంభంలో ఉన్న కోర్టును గిద్దలూరుకు తరలించినట్లు పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం గిద్దలూరులో సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు, అడిషనల్‌ సివిల్‌ జడ్జ్‌ జూనియర్‌ డివిజన్‌ కోర్టు, ప్రిన్సిపాల్‌ సివిల్‌ జడ్జ్‌ జూనియర్‌ డివిజన్‌ కోర్టు ఉండగా ఇటీవల కాలంలో సెకండ్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌) కోర్టు మంజూరైంది. 2008వ సంవత్సరంలో కంభంలో కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉండగా అప్పట్లో అది కూడా గిద్దలూరుకు తరలిపోయింది. దీంతో కంభంలో కోర్టు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మూడు మండలాల ప్రజలు మరింతగా నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం మార్కాపురం, గిద్దలూరులో మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రజల, పోలీస్‌ అధికారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాలను కలిపి కంభం పోలీస్‌ సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. ఈ పరిణామం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇదే మాదిరి కోర్టు సైతం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

న్యాయవాదులు ఎక్కువే..

కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో వంద మందికి పైగా న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సుమారు 30 మంది న్యాయవాదులు గిద్దలూరు, మార్కాపురం కోర్టులకు వెళ్తుండగా మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. మార్కాపురంలో న్యాయ కళాశాల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో న్యాయ విద్యనభ్యసించే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. కంభంలో కోర్టు ఏర్పాటు చేస్తే నూతన న్యాయవాదులకు సైతం అవకాశాలు పెరుగుతాయి. గిద్దలూరులోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, జుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పరిధిలో అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలున్నాయి. కోర్టు పరిధిలో సుమారు మూడు వేల కేసుల వరకు పెండింగ్‌లో ఉండగా వీటిలో ఈ మూడు మండలాలకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సీనియర్‌ న్యాయవాదులు చెబుతున్నారు.

కక్షిదారులకు ప్రయోజనం

అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ గ్రామాలు, బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి లోయ గ్రామాల ప్రజలు గిద్దలూరు కోర్టుకు వెళ్లాలంటే సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. లోయ ప్రాంతాల నుంచి సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక రోజు మొత్తం సరిపోతోంది. కొన్ని సందర్భాల్లో కోర్టు సమయానికి చేరుకోలేక కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంభంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా కేసుల విచారణ వేగంగా జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో గిద్దలూరులో సైతం పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గి, అక్కడి కేసుల విచారణ వేగంగా పూర్తయ్యే అవకాశముందన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. కక్షిదారుల ఇబ్బందుల దృష్ట్యా కంభంలో కోర్టు ఏర్పాటు చేసే విధంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపాలని ప్రజలు కోరుతున్నారు.

మూడు మండలాల ప్రజలకు దూరాభారంగా న్యాయస్థానాలు

లోయ ప్రాంతాల నుంచి కోర్టుకు వెళ్లాలంటే సుమారు 70 కి.మీ ప్రయాణం

గిద్దలూరు న్యాయస్థానంలో పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులు

కంభంలో కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులకు ఉపయోగకరం

నవాబుల కాలం నుంచి స్వాతంత్య్రానంతరం వరకు కంభంలో ఉన్న కోర్టు

ఆ తర్వాత గిద్దలూరుకు తరలించిన వైనం

నూతన మార్కాపురం జిల్లాలోనైనా కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలని ప్రజాకాంక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement