సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

కలెక్టర్‌ రాజాబాబు

అద్దంకి: ప్రజల్లో నమ్మకం కలిగేలా అధికారులు సేవలందించాలని కలెక్టర్‌ రాజాబాబు అన్నారు. కొత్తగా ఏర్పడిన అద్దంకి రెవెన్యూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై మరింత దృష్టి సారించి సమన్వయంతో పనిచేయాలన్నారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌ ప్రణాళికలు, రెవెన్యూ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్‌ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదన్నారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. మండల స్థాయి అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ, ప్రతిరోజూ ఉదయం పారిశుధ్యం, ఉపాధి హామీ పనులను పరిశీలించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిర్వహిస్తున్న తీరును రోజుకు ఒక గ్రామం చొప్పున పరిశీలించాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, భూగర్భ నీటిమట్టం పెంచడం వంటి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని హెచ్చరించారు. ఆయా విషయాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారుల పనితీరు ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వచ్చే మూడు నెలల కాలాన్ని సమర్ధంగా వినియోగించుకోవాలని చెప్పారు.

ప్రత్యేక ప్రణాళిక అవసరం ..

ఎరువులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించి పంట దిగుబడులు పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. దీనికోసం వచ్చే మూడు నెలల కాలానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించడం, పంటల మార్పిడి దిశగా వారిని ప్రోత్సహించడం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ చెప్పారు. వెబ్‌ల్యాండ్‌, మ్యుటేషన్‌, 22(ఏ), ఇతరములు వంటి రెవెన్యూ సమస్యలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. రెవిన్యూ క్లినిక్‌ , మీకోసం కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలను పునరావృతం కాకుండా సహేతుంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మరిన్ని సమస్యలు తలెత్తకుండా ఎండార్స్‌మెంట్‌ స్పష్టంగా ఉండాలన్నారు. డివిజన్‌లోని 22(ఏ) భూముల సమస్యను సత్వరం పరిష్కరించేలా క్షేత్రస్థాయిలో తాను విస్తృతంగా పర్యటిస్తానని తెలిపారు. సమావేశాల్లో సీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఆర్టీఓ జాన్సన్‌, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ ఆఫీసర్‌ సువార్తమ్మ, ఏడీఏలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement