అంతంతమాత్రమే! | - | Sakshi
Sakshi News home page

అంతంతమాత్రమే!

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

ఆస్తి పన్ను చెల్లింపులు

మార్కాపురం టౌన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆస్తి పన్ను చెల్లించేందుకు భవన యజమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పోరేషన్‌తోపాటు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, చీమకుర్తి, పొదిలి, అద్దంకి, కందుకూరు, పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్ల కోసం మున్సిపల్‌ అధికారులు గడిచిన రెండు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు. వార్డు సచివాలయ సిబ్బందిని టీమ్‌లుగా విభజించి పన్ను చెల్లించేలా భవనాల యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయినప్పటికీ పురపాలక సంఘాల్లో పన్ను బకాయిలు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన మేర మున్సిపల్‌ ఖజానాకు నగదు జమ కానట్టు తెలుస్తోంది.

వసూళ్లు సగమే..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది విధించిన పన్ను, పాత బకాయిలతో కలిపి రూ.139.85 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.76.25 కోట్లు మాత్రమే చెల్లించారు. ఒంగోలు కార్పొరేషన్‌లో రూ.83.14 కోట్ల డిమాండ్‌ ఉండగా మార్చి 31 నాటికి రూ.40.48 కోట్లు, మార్కాపురం మున్సిపాలిటీలో రూ.13.49 కోట్లకుగాను రూ.8.29 కోట్లు, గిద్దలూరులో 5.50 కోట్లకుగాను రూ.3.81 కోట్లు, కనిగిరిలో రూ.5.82 కోట్లకుగాను రూ.3.77 కోట్లు, దర్శిలో రూ.5.92 కోట్లకుగాను రూ.3.55 కోట్లు, చీమకుర్తిలో రూ.5.36 కోట్లకుగాను రూ.3.24 కోట్లు, పొదిలిలో రూ.4. 57 కోట్లకుగాను రూ.2.18 కోట్లు, అద్దంకిలో రూ.5.71 కోట్లకుగాను రూ.4.59 కోట్లు, కందుకూరులో రూ.10.34 కోట్లకుగాను రూ.6.34 కోట్లు వసూలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన డిమాండ్‌ ఉన్న మొత్తంలో సుమారు 60 శాతం మేర పన్ను ప్రజలు చెల్లించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆస్తి పన్ను వడ్డీపై నూరు శాతం రాయితీ ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్ల కాలంలో కేవలం 50 శాతం మాత్రమే రాయితీ ఇవ్వడంతో పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేస్తే వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుందని భవనాల యజమానులు అభిప్రాయపడుతున్నారు.

పట్టణాల్లో పన్ను బకాయిలు రూ.139.85 కోట్లు

ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి చెల్లించినది రూ.76.25 కోట్లు

వడ్డీపై 50 శాతం రాయితీ ఇచ్చినా ఫలితం నామమాత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement