పామూరు: లారీ డ్రైవర్ అతి వేగం ఒకరిని బలి తీసుకోగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన పామూరు మండలంలోని తిరగలదిన్నె గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి నాగరాజు, తన భార్య నారాయణమ్మ, కుమార్తె అనన్యకృష్ణ, కుమారుడు రిత్విక్‌రాముతో కలిసి గత కొంత కాలంగా బెంగళూరులో బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం నాగరాజు కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి సామగ్రితో సహా స్వగ్రామం గొల్లపల్లికి మినీ లారీలో వస్తున్నారు. సోమవారం రాత్రి తిరగలదిన్నె వద్ద ఓ లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. దానిని మినీ లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో క్యాబిల్‌లో కూర్చుని ఉన్న నారాయణమ్మకు తీవ్ర, ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు మోస్తరు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను పామూరు సీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నారాయణమ్మ(28) చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ మహేంద్ర అతివేగమే ప్రమాదానికి కారమని స్థానికులు చెబుతున్నారు. మరో గంటలో ఇంటికి వెళ్తామనగా.. భార్య మృత్యువాతపడటం, కుమార్తె, కుమారుడు గాయాలపాలవడంతో నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నారాయణమ్మ భౌతికకాయాన్ని కనిగిరి తరలించారు.
చికిత్స పొందుతున్న చిన్నారి రిత్విక్ రాము
చికిత్సపొందుతున్న చిన్నారి అనన్యకృష్ణ
మృతురాలు దాసరి నారాయణమ్మ
ఆగిఉన్న లారీని ఢీకొన్న మినీ లారీ
ప్రమాదంలో మహిళ మృతి
భర్త, ఇద్దరు పిల్లలకు గాయాలు


