ఉమ్మడి జిల్లాలో అకాల వర్షంతో 1182 హెక్టార్లలో పంటనష్టం నష్టపోయిన రైతులు 1292 మంది తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి పంటలు
మార్కాపురం: గతవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి మొత్తం 1182 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. 1292 మంది రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి తదితర పంటలు పూర్తిస్థాయిలో నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా మొక్కజొన్నతోపాటు అలసంద, వరి, పొద్దుతిరుగుడు పంటలు అకాల వర్షానికి నేలకొరిగాయి. మార్కాపురం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం రాళ్లపల్లి గ్రామంలోనే అత్యధికంగా 213 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు నివేదిక పంపారు. యర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి, పుల్లలచెరువు, పొదిలి, అర్ధవీడు, తదితర మండలాల్లో రైతులు కూడా నష్టపోయారు. ప్రకాశం జిల్లాలో 770 మంది, మార్కాపురం జిల్లాలో 522 మంది రైతులు నష్టపోయారు. 533.42 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, రాగి, అలసంద పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో వరిసాగు చేసిన రైతులు 102 మంది, మొక్కజొన్న రైతులు 151 మంది, పొద్దుతిరుగుడు రైతులు 225 మంది, రాగి సాగు చేసిన 43 మంది రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి, గన్నవరం, వెలిగండ్ల, పి నాగులవరం, రామగోపాలపురం, కనిగిరి మండలంలోని జమ్మలమడక, హెచ్‌ఎంపాడు మండలంలోని నందనవనం, సీఎస్‌పురం మండలంలోని అరివేముల, కంభం మండలంలోని రావిపాడు, అర్ధవీడు మండలంలోని కాకర్ల, మార్కాపురం మండలంలోని చింతగుంట్ల గ్రామాల్లో రైతులు నష్టపోగా దర్శి మండలంలోని కొర్లమడుగు, కొత్తపల్లి, లక్ష్మీ నారాయణపురం, త్రిపురసుందరపురం, పెద్ద ఉయ్యాలవాడ, రామచంద్రాపురం, బసిరెడ్డిపల్లి, లింగసముద్రం మండలంలోని పెద్దపవని గ్రామాల్లో అకాల వర్షాలకు పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన వర్షాలకు కూడా పంట నష్టం జరిగింది. ఆ పరిహారం కోసం కూడా రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో గత వారం కురిసిన అకాల వర్షానికి మళ్లీ పంటలు దెబ్బతినడంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబు సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.


