ఒంగోలు టౌన్: జిల్లాలో చెడునడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గంజాయి, పేకాటను కట్టడి చేసేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. తరచుగా గ్రామాలను సందర్శిస్తూ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయాలని, సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ఇతరా శాఖలతో సమన్వయం చేసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సైబర్‌నేరాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, కొత చట్టాలు, శిక్షలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేసే విధంరగా ప్రోత్సహించాలని, పోలీస్ స్పందన వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలన్నారు. బహింరంగంగా మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ, డీసిఆర్బీ సీఐ దేవప్రభాకర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ హర్షవర్థన్ రాజు
ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సమీక్ష


