ఒంగోలు టౌన్: నగరంలో ఖరీదైన ప్రాంతంగా చెప్పుకొనే భాగ్యనగర్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యనగర్ రెండో లైనులో నివాస గృహాల మధ్య ఉన్న రెండు అపార్టమెంట్లలో ఒక మహిళ హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బుధవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక మహిళా నిర్వహకురాలితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆర్థికంగా స్థితిమంతురాలైన నిర్వాహకురాలికి నగరంలో రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె ఆన్‌లైన్ విధానంలో కాల్ గర్‌ల్స్‌ను ఏర్పాటు చేస్తూ విటుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు హెచ్చరిక
ఒంగోలు టౌన్: మోడిఫైడ్ సెలెన్సర్లతో చెవులను హోరెత్తించేలా శబ్ధం చేస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టే బైకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. నగరంలో గత నాలుగు నెలలుగా ప్రత్యేక డ్రైవ్‌లో గుర్తించి తొలగించిన మోడిఫైడ్ సైలెన్సర్లను బుధవారం రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 100 సైలెన్సర్లు, 400 అనధికార లైటింగ్ సెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తు చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక శబ్ధాల వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అధిక కాంతినిచ్చే లైట్లను వాహనాలకు అమర్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, తాలుకా సీఐ విజయ కృష్ణ, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఓగూరులో సచివాలయానికి తాళం
కందుకూరు రూరల్: మండలంలోని ఓగూరులో స్వర్ణ గ్రామ సచివాలయానికి గ్రామస్తులు బుధవారం తాళం వేశారు. సదరం స్లాట్ బుక్ చేసుకునేందుకు స్థానికులు కొందరు సచివాలయానికి ఉదయం 10.30 గంటలకు రాగా సిబ్బంది ఎవరూ లేరు. కాసేపు ఆగి మళ్లీ రాగా తలుపులు తీసి ఉన్నాయి కానీ ఉద్యోగులు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. సచివాలయానికి తాళం వేసి ఎంపీడీఓ రత్నజ్యోతికి అప్పగించారు. ఈ విషయమై ఎంపీడీఓ స్పందిస్తూ.. పంచాయతీ కార్యదర్శి డీపీఓ కార్యాలయంలో ఎలక్షన్ వర్క్‌లో ఉన్నారని, డిజిటల్ అసిస్టెంట్ మెడికల్ లివ్‌లో ఉండటంతో ఇన్‌చార్జిని నియమించామన్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్వేలో ఉండగా, ఇన్‌చార్జి డిజిటల్ అసిస్టెంట్, మహిళా సంరక్షణ కార్యదర్శి సమాచారం ఇవ్వకుండా సెలవు పెట్టాలరని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


