● సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన డాక్టర్
గిద్దలూరు(బేస్తవారిపేట): ఆర్టీసీ బస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా అదే బస్సులో ఉన్న డాక్టర్ సీపీఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గిద్దలూరు–నంద్యాల ఘాట్‌లో బుధవారం చోటుచోసుకుంది. గిద్దలూరు నుంచి కర్నూలు వెళ్లేందుకు హసీనాబాను అనే బహిళ ఆర్టీసీ బస్ ఎక్కింది. మార్గమధ్యలో బస్‌లో కుప్పకూలిపోయింది. సెల్‌ఫోన్ సిగ్నల్ లేదు.. అంబులెన్స్ వచ్చేందుకు అవకాశం లేదు. ఆర్టీసీ బస్‌ను డ్రైవర్ ఒక పక్కకు తీసి నిలిపారు. తోటి ప్రయాణికులు ఆందోళన చెందుతున్న తరుణంలో అదే బస్‌లో ఉన్న నంద్యాల ఎంఎస్‌ఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కందుల ఉమామహేశ్వరరెడ్డి పరిస్థితిని గమనించారు. మహిళకు 15 నిమిషాల పాటు సీపీఆర్ చేయగా ఆమె కళ్లు తెరిచి ఊపిరి తీసుకుంది. మహిళ ప్రాణం నిలబెట్టిన వైద్యుడికి ప్రయాణికులంతా కృతజ్ఞతలు తెలిపారు.
● ఒకరిని పట్టుకుని చితకబాదిన స్థానికులు
సింగరాయకొండ: మండల కేంద్రమైన సింగరాయకొండలోని ఆంజనేయనగర్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి యత్నించగా స్థానికులు అప్రమత్తమై ఒకరిని బంధించారు. దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున చోటుసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆంజనేయనగర్ సమీపంలో నివసిస్తున్న పాదర్తి సురేష్ ఇంటి ప్రహరీ దూకిన దొంగలు వెనుక వైపు తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సురేష్ గమనించి ఇంటి లోపలికి వచ్చిన అస్సాం రాష్ట్రానికి చెందిన రతన్‌బైగాను గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో సురేష్ భార్య పెద్ద పెట్టున కేకలు వేయడంతో దొంగల ముఠా సభ్యులు పరారయ్యారు. రతన్‌బైగా సైతం ఇంటి యజమానిపై దాడికి యత్నించి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు వచ్చి చితకబాదారు. పోలీసులకు సమాచారం అందిచగా స్టేషన్‌లో ఎవరూ అందుబాటులో లేరని బదులివ్వడంతో చేసేది లేక డయల్‌కు 100కు కాల్ చేశారు. మరో అరగంట తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దొంగను చితకబాదిన తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని స్థానికులు చెప్పారు.
దొంగ కాదు.. పిచ్చోడట!
రతన్‌బైగాను పోలీసులు తమ బైక్‌పై స్టేషన్‌కు తరలించారు. అతడికి తెలుగు రాదని, హిందీలో ప్రశ్నిస్తే నలుగురం వచ్చామని చెప్పాడని రాత్రి 7 గంటల నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో కూడా ఉందని, అయితే పోలీసులు మాత్రం పిచ్చోడని చెబుతున్నారని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కంభం: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం రాత్రి కంభంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కంభానికి చెందిన సయ్యద్ సద్దాం (32) టైల్స్ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


