ఒంగోలు: ఈనెల 28న స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్స్‌లో అండర్–19 వన్ డే, మల్టీ డే క్రికెట్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా కలర్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. వివరాలకు 9573424360, 9246222999ను సంప్రదించాలని సూచించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో అండర్–19 బాలబాలికల కబడ్డీ పోటీలను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు పి.విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రాడాకారులు ముందుగా క్రీడాభారతి యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ఒక పాఠశాల నుంచి, గ్రామం నుంచి ఎన్ని టీములైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వివరాలకు 9849429839, 96031 62699ను సంప్రదించాలని సూచించారు.
గుడ్లూరు: ప్రైవేటు స్కూల్ బస్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయిన ఘటన మండలంలోని సాలిపేట– రావూరు గ్రామాల మధ్య బుధవారం జరిగింది. తల్లిదండ్రుల సమాచారం మేరకు..మండలంలోని చేవూరు గ్రామంలోని సాయి ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్ ఉలవపాడు మండలం రామాయపట్నం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రావూరు సమీపం దగ్గర అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకొనిపోయింది. బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్ అజాగ్రత్త వలనే ఈప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గుడ్లూరు: గూడ్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన బంగారం బ్రాస్‌లెట్‌ను బస్‌లో మర్చిపోయి దిగింది. వెంటనే గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్ డ్రైవర్‌కు ఫోన్ చేయగా సీటులోనే బంగారం బ్రాస్‌లెట్ పడి ఉంది. కండక్టర్ తీసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలికి గుడ్లూరు పోలీసులు బ్రాస్‌లెట్ అప్పగించారు. నిజాయతీగా బంగారాన్ని అప్పగించిన ఆర్టీసీ కండక్టరు, డ్రైవర్లను పోలీసులు, బాధితురాలు అభినందించి శాలువతో సన్మానించారు.
గిద్దలూరు రూరల్: మండలంలోని నరవ గ్రామ సమీపంలో గల నీటి కుంటలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిల్లెల సాలమ్మ(85) గ్రామంలో ఒంటరిగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది నీటి కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సాలమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కాగా, పదేళ్ల క్రితం కుమారుడు మరణించాడు. కుమార్తెకు వివాహమై సాలమ్మకు దూరంగా ఉంటోంది. ఒంటరి జీవితాన్ని భరించలేని సాలమ్మ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23వ తేదీన నీటి కుంటలో పడి మృతి చెందింది. నీటి కుంటలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


