ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాధీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్‌లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్‌కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


