పొగాకు వేలం మొదటి రోజే నిరాశాజనక ధరలతో ప్రారంభం కేజీకి రూ.250ల ప్రారంభ ధరతో వేలం ప్రారంభం ధరలు ఇలా ఉంటే నిండా మునుగుతామంటూ రైతుల ఆందోళన
కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభం రోజే రైతులకు భారీషాక్ ఇచ్చారు వ్యాపారులు. కేజీకి కేవలం రూ.250ల ప్రారంభ ధరతో వేలాన్ని ప్రారంభించారు. రైతులు ఊహించిన ధరలకు దరిదాపుల్లో కూడా ప్రారంభ ధరలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధరలు ఇదే విధానంలో కొనసాగితే భారీ నష్టాలతో నిండా మునుగుతామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగే అవకాశం లేదని అటు బోర్డు అధికారులు, ఇటు వ్యాపారుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా పొగాకు రైతులకు భారీ నష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2025–26 ఏడాది పొగాకు సీజన్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొదటి విడతలో భాగంగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో వేలాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా కందుకూరు–1 వేలం కేంద్రంలో 18 బేళ్లను వేలానికి ఉంచారు. కేజీకి రూ.250 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే క్వింటా పొగాకు రూ.25 వేలు మాత్రమే వచ్చింది. అదీ నాణ్యమైన బ్రైట్‌గ్రేడ్ పొగాకు రూ.250లు మాత్రమే ఇచ్చారు. దీంతో రైతులు ప్రారంభ ధరల పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు భారీ స్థాయిలో పెరిగాయని ఈ విధమైన ధరలు ఇస్తే కోలుకోలేకుండా దెబ్బతింటామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే ధరలు ఈ విధంగా ఉంటే ఇక లోగ్రేడ్ పొగాకు ధరలు ఎంత దారుణంగా ఉంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధమైన ధరలతో వేలం కొనసాగితే సరాసరి ధరలు భారీగా పడిపోతాయని భావిస్తున్నారు. కర్ణాటక మార్కెట్‌లో సరాసరి ధర రూ.230లు వచ్చిందని, ఇక్కడ ఆ ధరలు కూడా వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు, వ్యాపారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగా లేనందున ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పొగాకు రైతుల భవిష్యత్ ఏంటో మొదటి రోజు వేలంలోనే స్పష్టమైంది.


