ఒంగోలు సబర్బన్:
గ్రామ పంచాయతీల కార్యదర్శుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్‌హర్ ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయంపై ప్రకాశం భవన్ ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలో బెన్‌హర్ మాట్లాడుతూ కార్యదర్శుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని జోన్–3 (ప్రకాశం, నెల్లూరు, గుంటూరు) పంచాయతీ కార్యదర్శులకు జరుగుతున్న అన్యాయం దారుణమైందన్నారు. ఆత్మగౌరవంతో కూడిన పదోన్నతుల కోసం చేసిన న్యాయపోరాటంలో వచ్చిన తాజా తీర్పు అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. కోర్టులో వాస్తవాలను, ఆధారాలను ఎన్ని నిరూపించినా అన్యాయానికే బలం తోడై న్యాయం వెనకబడిందని ఆవేదన చెందారు. ముఖ్యంగా జోన్–3 లో గ్రేడ్–3 నుంచి డ్–2 ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయం వర్ణనాతీతంగా మారిందన్నారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 లోని రూల్ 24 ప్రకారం జరగాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి తప్పనిసరిగా జోనల్ సీనియారిటీ లిస్టును అధికారికంగా పబ్లిష్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాతే కచ్చితమైన సీనియారిటీ లిస్ట్‌ను బహిర్గతం చేయాలన్నారు. కానీ ఇక్కడ ఏ సీనియారిటీ లిస్టును అధికారికంగా చూపకుండా, అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా, రహస్యంగా దొడ్డిదారిన ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోందని కార్యదర్శులందరికీ తెలుసు, కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలంటే చాలా మంది భయపడుతున్నారన్నారు. రిలేనిరాహార దీక్షలో కార్యదర్శులు అనపర్తి నాగేశ్వర రావు, కే.వెంకట్రావుతో పాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్‌హర్
ప్రకాశం భవన్ ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం


