ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎక్కడా వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరతలేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జేసీ అన్నీ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ వినియోగం, సరఫరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పౌర సరఫరా అధికారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వినియోగదారులకు అవసరమైన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు నిల్వలు అందుబాటులో ఉంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ పద్మశ్రీ,, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వర రావు, జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు, డీటీసీ సుశీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, ఆర్టీసీ ఆర్‌ఎం సత్యనారాయణ, డీఈఓ రేణుక, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, శ్రియా వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావుతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


