నేషనల్ హైవేపై బైఠాయించిన హసానాబాద వాసులు
పెద్దదోర్నాల: నేషనల్ హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ హసానాబాద వాసులు సోమవారం టోల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. హైవేపై నిర్మిస్తున్న టోల్ ప్లాజాకు అధికారులు ముందస్తుగానే జమ్మిదోర్నాల టోల్ ప్లాజాగా పేరు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్ మాట్లాడుతూ ఎకరా రూ.2 కోట్ల విలువైన భూములను టోల్ ప్లాజా నిర్మాణం కోసం తమ గ్రామస్తులు కేవలం రూ.4 లక్షలకే ఇచ్చారన్నారు. టోల్ ప్లాజా నిర్మాణానికి భూములు ఇచ్చిన గ్రామస్తుల వాసుల కోరిక మేరకు టోల్ ప్లాజాకు హసానాబాద టోల్ ప్లాజా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట రమణయ్య సంఘటనా స్థలికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడి అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు.


