పేకాటరాయుళ్లపై వరస దాడులు 84 మంది కోడిపందెం నిర్వాహకుల అరెస్టు బుకీల భరతం పడుతున్న పోలీసులు ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడి
ఒంగోలు టౌన్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నేటి వరకు 41 రోజుల పాటు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 189 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,82,394 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కోడి పందేలు నిర్వహిస్తున్న 84 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,10,180 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌పై కేసు నమోదు చేసి 3 ల్యాప్‌టాప్‌లు, 21 సెల్ ఫోన్లతో పాటుగా రూ.24 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కమ్యునికేటర్, బోర్డు, 3 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే మాట్కా నిర్వహిస్తున్న 5 స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి నుంచి రూ.15,760 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 98 మంది కోడి పందేలు ఆడే పాత ముద్దాయిలు, నిర్వాహకులను బైండోవర్ చేసినట్లు చెప్పారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పోలీసులు 1500 మందికి పైగా యువత, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బెట్టింగుల గురించి అప్రమత్తం చేశామన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికను పర్యవేక్షించాలని, అనుమానాస్పద కార్యక్రమాలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు.


