కనిగిరిలో శ్మశాన రణం | - | Sakshi
Sakshi News home page

కనిగిరిలో శ్మశాన రణం

Mar 21 2026 4:55 AM | Updated on Mar 21 2026 4:55 AM

కనిగిరిరూరల్‌: కనిగిరి పట్టణంలో వాల్మీకి బోయకులస్తుల శ్మశాన వివాదం శుక్రవారం పోలీసులు, అధికారులు తీరుతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ కులానికి చెందిన సీ అంజమ్మ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఆ సామాజికవర్గం వారు గురువారం రాత్రంతా జాగారం చేశారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి శ్మశానవాటికగా ఉపయోగిస్తున్న స్థలంలోనే తాము ఖననం చేస్తామని భీష్మించారు. రాత్రంతా హైవే పక్కనే శవాన్ని పెట్టుకుని జాగారం చేస్తూ నిరసన తెలిపారు. అయితే ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని.. రిజిస్టర్‌ భూమి అని, సర్వే నం 554లోని భూమిలో ఖననం చేయడానికి కుదరదంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న సంగతి విదితమే.

తోపులాట..ఆర్తనాదాల మధ్య మృతదేహం తరలింపు..

వాస్తవం ఏమిటీ..తెరవెనుక ఎవరున్నారనేది పక్కన పెడితే.. పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందన్న చర్చ నడుస్తోంది. భారీగా పోలీసులను మోహరించారు. కనిగిరి డివిజన్‌తో పాటు, ఇతర మండలాలకు చెందిన ఎస్సైలు, పోలీసులు, ప్రత్యేక బలగాలు వచ్చాయి. పది నిమిషాలు బాధిత వ్యక్తులతో మాట్లాడిన పోలీసులు హఠాత్తుగా వారిని నెట్టేసి మృతదేహాన్ని మున్సిపల్‌ ట్రాక్టర్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో వాల్మీకి బోయకులస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్సై, పోలీసులు, వాల్మీకి బోయకులస్తులను నిర్ధాక్షణ్యంగా పక్కకు నెట్టి మృతదేహం ఉన్న ట్రాక్టర్‌ను పట్టణంలోని గార్లపేట రోడ్డులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. ఈక్రమంలో మృతురాలు అంజమ్మ కోడలికి, బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులను పెట్టి తోసేశారు. పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

శ్మశాన వాటిక వద్ద నిరసన..

మృతురాలు అంజమ్మ బంధువులు కొందరు హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర శాపనార్ధాలు పెట్టారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. తమకు చేసిన అన్యాయం, పాపం ఊరికే పోదని మృతురాలి బంధువులు దుమ్మెత్తి పోశారు. కనీసం మట్టి కూడా ఇవ్వకుండా ఖననం చేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము బీసీ సామాజిక వర్గానికి చెందిన వారం అని తీవ్ర అన్యాయం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సొంత బంధువులు వచ్చి.. అంత్యక్రియలు చేసుకోవాలని అధికారులు చెప్పారు.

పోలీస్‌ పహారా..

అంజమ్మ భౌతిక కాయాన్ని తీసుకెళ్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు బోయపాలెం నుంచి ఎవరూ రోడ్డు మీదకు రాకుండా పోలీస్‌ పహారా పెట్టారు. సుమారు 30 మంది పోలీసులు, మహిళా పోలీసులు 9వ వార్డు బోయపాలెం కాలనీ ప్రధాన రహదారికి అడ్డంగా నిలబడ్డారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలీసులు అక్కడే ఉన్నారు. కాగా.. రెండ్రోజుల నుంచి ఘటన ఏరియాలో కనిపించని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు శ్మశాన వాటిక స్థలం వద్ద ప్రత్యక్షమైనట్లు తెలిసింది.

సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి..

వాస్తవానికి వాల్మీకి బోయ కులస్థుల శ్మశాన వాటిక స్థలం సమస్య కొంత కాలం నుంచి ఉన్నా.. ఈ రెండేళ్లలో తీవ్ర జటిలంగా మారి రచ్చకెక్కుతోంది. అలాంటి సమయంలో క్షేత్ర స్థాయి పరిస్థితిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్య మరింత తీవ్రం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

భూ రిజిస్టర్‌ పట్టాదారుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం

సర్వే నంబర్‌ 554లో తమకు రిజిస్టర్‌ అయిన భూమిలో కొందరు వ్యక్తులు అంత్యక్రియలు, ఖనన కార్యక్రమాలు చేసేందుకు వస్తున్నారని, తమకు న్యాయం చేయాలని రిజిస్ట్రేషన్‌దారుడు గురువారం ఫిర్యాదు చేశాడు. శాంతిభద్రతల సమస్య రాకుండా ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నాం.

– ఉప్పు శ్రీనివాసులు, సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement