జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన బొప్పాయి, మిరప, వరి, జొన్న, పొగాకు, మామిడి పంటలకు నష్టం తీవ్ర గాలులకు లేచిన బ్యారన్ల పైకప్పులు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
మర్రిపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మర్రిపూడి మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కాకర్ల, చిలంకూరు, శివరాయునిపేట తదితర గ్రామాల్లో 200 ఎకరాల్లో సాగుచేసిన లేత పొగాకు పూర్తిగా దెబ్బతిని పంట నేలకు ఒరిగింది. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో ఇళ్ల రేకులు పైకప్పులు లేచిపోయాయి. చెట్లు వేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు పడి సరఫరా నిలిచిపోయింది. చిమట, కాకర్ల గ్రామాల్లోని బ్యారన్ రేకులు ఎగిరి దూరంగా పడిపోయాయి. దీంతో క్యూరింగ్ జరుగుతున్న బ్యారన్‌లో పొగాకు పూర్తిగా తడిసిపోయింది. ఆయా గ్రామాల్లో దాదాపు రూ.2.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకర్ల గ్రామానికి చెందిన మొల్లల సుబ్బారెడ్డి, మనోహర్‌రెడ్డిలకు చెందిన ఒక్కో బ్యారన్‌లో 1200 పొగాకు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా రేకులు ఎగిరిపోయి, ఆకు తడిసిపోయింది. అలాగే చిమట గ్రామానికి చెందిన గంగిరెడ్డి మూడవ బ్రహ్మారెడ్డి, వెలుతుర్ల మాలకొండయ్య, భూంపల్లి రమణయ్య, రాగిపిండి శ్రీను, పులిచర్ల వెంకటసుబ్బయ్యలకు చెందిన బ్యారన్‌లలో పొగాకు క్యూరింగ్ జరుగుతుండగా విపరీతంగా వీచిన గాలులకు బ్యారన్ పై కప్పులు లేచి దూరంగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు సుమారు రూ.1.5 లక్షల చొప్పున సుమారు రూ.11 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.


