త్రిపురాంతకం: ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన వేదపండితుడు నాగఫణిశాస్త్రి, అర్చకుడు ప్రసాదశర్మ పూజలు, కుంకుమార్చన నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పల్లకి సేవ, రాత్రి పద్మవాహనంపై అమ్మవారి ఉత్సవం నిర్వహించారు. అలాగే పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వరస్వామి గ్రామోత్సవం వైభవంగా సాగింది. అర్చకుడు విశ్వనారాయణశాస్త్రి పూజలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందజేశారు. భక్తులు గ్రామ కూడళ్లలో పందిళ్లు వేసి స్వామివారిని సాదరంగా ఆహ్వానించారు. భక్త బృందాల కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయాల ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


