చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి పిడుగుపాటుకు మహిళ మృతి పిడుగుపాటుకు ఎద్దు మృతి అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య హిందీ పరీక్షకు 28,422 మంది హాజరు

సీఎస్‌పురం(పామూరు): చెట్టుపై చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వి.బైలులో బుధవారం జరిగింది. ఎస్సై అనూక్‌ తెలిపిన వివరాలు... మండలంలోని వి.బైలు గ్రామానికి చెందిన జమకాల నడిపి ఓబయ్య(67) మంగళవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం ఒంగోలులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా అనూక్‌ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఓబయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కురిచేడు: పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పడమర వీరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చౌడేశ్వర కాలనీలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నమ్మ ప్రతిరోజు లాగా బుధవారం కూడా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిర్చి కోతకు వెళ్లింది. పొలంలో మిరపకాయలు కోస్తుండగా సాయంత్రం ఉరిమిన ఉరుములకు పిడుగులు పడటంతో షాక్‌కు గురై మృతి చెందింది. పేద మహిళను మృత్యువు పిడుగు రూపంలో కబళించిందని తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు.

పెద్దదోర్నాల: వాతావరణంలో మార్పుల ప్రభావంతో అకాల వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని బలిజపల్లె గిరిజన గూడెం సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. ఐనముక్కలకు చెందిన రైతు లింగాల అచ్చయ్యకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. లక్ష రూపాయల విలువ చేసే ఎద్దు మృతి చెందడంతో జీవనాధారాన్ని కోల్పోయానంటూ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు.

కురిచేడు: అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని బోదనంపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..బోధనంపాడు గ్రామానికి చెందిన వెలుతుర్ల బ్రహ్మారెడ్డి(79)కి సుమారు రూ.60 లక్షల వరకు అప్పులుఉన్నాయి. వాటిని తీర్చలేక కోర్టు నుంచి ఐపీ నోటీసులు అప్పులు ఇచ్చిన వారికి పంపాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పొలం అమ్మి అప్పులు తీర్చాలంటే కుటుంబ సభ్యులు అంగీకరించకలేదు. దీంతో గ్రామంలో ముఖం చూపించలేక మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బుదవారం ఉదయం గ్రామంలోని నిర్మానుష ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్సై తెలిపారు.

ఒంగోలు సిటీ: పదో తరగతి హిందీ పరీక్షకు బుధవారం 28,572 మంది విద్యార్థులకు గాను 28,422 మంది హాజరు కాగా 150 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. డీఈఓ ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలు, మార్కాపురం జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలను, ఏసీజీ అండ్‌ డీఎంసీ అధికారులు 5 కేంద్రాలను తనిఖీ చేశారు. అదనంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ మొత్తం 80 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు రెండవ రోజు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించినట్లు డీఈఓ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement