రైతాంగ వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

రైతాంగ వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

రైతాంగ వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలి

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు

ఒంగోలు టౌన్‌: దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన షహీద్‌ భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై విద్యార్థి, యువజనులు పోరాటాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఈనెల 23వ తేదిన భగత్‌సింగ్‌ వర్థంతిని పురస్కరించుకొని చేపట్టే నిరసన కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ట్రంప్‌ విధించిన సుంకాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై 7 రెట్లు అధికంగా భారం పడిందన్నారు. విదేశీ కంపెనీలకు చెందిన జన్యుమార్పిడి విత్తనాలు, నకిలీ విత్తనాలను ఇష్టం వచ్చిన ధరలకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చిందని తెలిపారు. దేశీయ రైతాంగానికి లేని హక్కులు విదేశీ కంపెనీలకు మాత్రం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టేందుకే విత్తన చట్టం తీసుకొచ్చినట్లు విమర్శించారు. ఇరాన్‌పై యుద్ధంతో ప్రపంచంలో వస్తు రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చారని, రైతు పేదా తేడా లేకుండా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.వీరారెడ్డి మాట్లాడుతూ...మన ఎగుమతులపై 17 శాతం అమెరికా సుంకాలు విధిస్తుంటే, అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ఎటువంటి సుంకాలు విధించకపోవడం ఎంతగొప్ప దేశభక్తో చెప్పాలన్నారు. అమెరికాతో చేసుకున్న అడ్డగోలు, దోపిడీ ఒప్పందాలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు పొగడడం హాస్యస్పదమన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల హనుమంతరావు మాట్లాడుతూ సీబీఐ, ఈడీ వంటి నేరపరిశోధక సంస్థలను ఉసిగొల్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చారని, 10 శాతం వాటా చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపై 40 శాతం భరించాలని షరతులు విధించడం దారుణమన్నారు. సమావేశంలో రైతు నాయకులు ఎంఎస్‌ సాయి, ఎస్‌.లలితకుమారి, భీమవరపు సుబ్బారావు, ఎల్‌ రాజశేఖర్‌, చొప్పర జాలన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement