బాబు పాలనలో జీజీహెచ్ నిర్వీర్యం
మార్కాపురం టౌన్:
మార్కాపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురం కేంద్రంగా ఉన్న జిల్లా వైద్యశాలను ప్రభుత్వ జనరల్ వైద్యశాలగా 100 పడకల నుంచి 350 పడకలకు పెంచడం జరిగిందన్నారు. ఆనాడు 75 మంది స్పెషలిస్టు డాక్టర్లతో కలిపి మొత్తం 498 మంది సిబ్బంది ఉన్నారన్నారు. 90 శాతం జీజీహెచ్‌లో సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఆనాడు ఓపీ 700 నుంచి 800 వరకూ వస్తుందని, వైద్యశాలకు అవసరమైన పరికరాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మార్కాపురం కేంద్రంగా రాయవరం మెడికల్ కాలేజీని కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేయించడంతో పాటు పనులను ప్రారంభించగా సుమారు 50 శాతానికిపైగా పనులు జరిగాయన్నారు. దురదృష్టవశాత్తూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. గత ఏడాది డిసెంబరు 30న మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించారని, అయితే జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు మెరుగుపరచాల్సిందిపోయి నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేవలం 15 మంది వైద్యులు మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. గతంలో 75 మంది డాక్టర్లున్న వైద్యశాలలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. 65 మంది స్టాఫ్ నర్సులుండగా, సుమారు 53 మందిని బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యశాలకు వస్తున్న రోగులను సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ సిబ్బంది చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందక దూర ప్రాంతాలైన గుంటూరు, ఒంగోలు, నంద్యాల, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం జిల్లా ఇచ్చినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి సరిపోదని, జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న వైద్య సేవలు కూడా లేకుండా చేయడంపై పునరాలోచన చేసుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలు కాకుండా ఈ ప్రాంతంలో జరిగే పరిస్థితులపై ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ఈ ప్రాంత పరిస్థితులపై పునరాలోచించి పూర్తిస్థాయిలో వైద్యశాలకు వైద్యసిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. వైద్యశాలలో ఇంతటి దయనీయ పరిస్థితి ఏర్పడినా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం కేంద్రంగా ఉన్న మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేస్తూ పీపీపీకి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. జీజీహెచ్‌ని కూడా నిర్వీర్యం చేసి కేవలం 15 మంది వైద్యులతో సరిపెట్టడం సరికాదని అన్నారు. సరైన సిబ్బంది లేని కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సక్రమంగా వైద్యం అందక.. దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేక అవస్థపడుతున్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్యశాలలో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తగ్గిన వైద్య సేవలు
ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలు
పట్టించుకోని కూటమి ఎమ్మెల్యే
వైఎస్సార్ సీపీ మార్కాపురం
నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు


