నెగిటివ్ బ్లడ్ అవసరం పడితే చుక్కలే అత్యవసర ఆపరేషన్లకు ఇబ్బందిగా మారిన రక్తం కొరత ఒంగోలులో రోజుకు 60 నుంచి 75 యూనిట్ల రక్తం అవసరం ఉమ్మడి జిల్లాలో మరో 50 యూనిట్లకి పైగా రక్తం అవసరం నెల్లూరు, గుంటూరు, చైన్నెలకు పరుగులు తీస్తున్న బాధితులు రెడ్‌క్రాస్‌ను దెబ్బ తీసిన కూటమి పాలకులు
ప్రతి ఏడాది వేసవిలో రక్తం కొరత ఉంటుందని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బ్యాంకర్లు, కార్పొరేట్ కంపెనీలు, జీవిత బీమా కంపెనీలు తమ ఉద్యోగుల చేత రక్త సేకరణ చేస్తుంటారని, వీరిలో కాలేజీ విద్యార్థుల నుంచి రక్తం సేకరించడం అధికంగా ఉంటుందని సమాచారం. సహజంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు జిల్లాలో రక్త సేకరణ క్యాంపులు నిర్వహిస్తుంటారని, కాలేజీలకు సెలవుల కారణంగా వేసవిలో రక్త సేకరణ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు సేకరించిన రక్తం నుంచి జీజీహెచ్‌కు 30 శాతం ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. చాలా వరకు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ కూడా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి జీజీహెచ్‌కు అందలేదని సమాచారం. ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
ఒంగోలు టౌన్:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 540 నర్సింగ్ హోంలు, వివిధ రకాల ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 90 ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులున్నారు. ఇక్కడ ప్రతినిత్యం వందల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. సుమారు 150 సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెండు కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు చేస్తున్నారు. లెక్కకు మిక్కిలిగా స్టంట్లు వేస్తున్నారు. ఇంకా మోకాలి ఆపరేషన్లు, మహిళల గర్భసంచి సమస్యలకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఒక్క జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్లకే రోజుకు 15 యూనిట్లకు పైగా రక్తం అవసరమవుతుంది. ఒంగోలులోని మిగిలిన ప్రైవేటు ఆస్పత్రులకు 50 నుంచి 75 యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర ఆపరేషన్లు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం కోసం బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. జీజీహెచ్‌కు వెళితే అక్కడ అవసరమైన రక్తం దొరకదు, ప్రైవేటుకు వెళితే రెడ్‌క్రాస్‌కు వెళ్లమంటారు. అక్కడకు వెళితే ఒట్టిచేతులు చూపుతున్నారని బాధితులు వాపోతున్నారు.
నగరంలో రక్త నిల్వలు ఇలా..
జిల్లాలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఒంగోలు నగరంలోని జీజీహెచ్‌తో పాటుగా కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకొస్తుంటారు. నగరంలో జీజీహెచ్, రెడ్‌క్రాస్‌లతోపాటు మొత్తం కలుపుకొని 6 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో జీజీహెచ్‌లో ఏ పాజిటివ్ 27, బీ పాజిటివ్ 42, ఓ పాజిటివ్ 47, ఏబీ పాజిటివ్ 5 యూనిట్ల రక్తం అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏ నెగిటివ్ 1, బీ నెగిటివ్ 2, ఓ నెగిటివ్ 2, ఏబీ నెగిటివ్ జీరో యూనిట్లు ఉన్నాయి. రెడ్ క్రాస్‌లో ఓ పాజిటివ్ హోల్ బ్లడ్ 2, పాకెట్ సెల్ 19, ఏ పాజిటివ్ హోల్ బ్లడ్ 3, పాకెట్ సెల్ 5, బీ పాజిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్‌సెల్ 17, ఏబీ పాజిటివ్ రెండు రకాలు నిల్వలు లేవు. ఓ నెగిటివ్ పాకెట్ సెల్ 1, హోల్ బ్లడ్ జీరో, ఏ నెగిటివ్ హోల్ బ్లడ్ జీరో, పాకెట్ సెల్ 1, బీ నెగిటివ్ రెండు రకాలు అందుబాటులో లేవు, ఏబీ నెగిటివ్ కూడా నిల్వలు లేవు. న్యూ విజన్ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ 4, బీ పాజిటివ్ 45, ఓ పాజిటివ్ 21, ఏబీ పాజిటివ్ 06 నిల్వలు ఉన్నట్లు నిర్వాహకుడు జి.నాగేశ్వరరావు తెలిపారు. నెగిటివ్ బ్లడ్ గ్రూపులు ఏవీ అందుబాటులో లేవని తెలిపారు. మార్కాపురం జీజీహెచ్‌లోని బ్లడ్ బ్యాంకులో ఓ పాజిటివ్ 2, బీ పాజిటివ్ 3 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా గ్రూపులు, నెగిటివ్ బ్లడ్ పూర్తిగా నిల్వలు లేవని సమాచారం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒంగోలు, గుంటూరుకు పరిగెత్తాల్సి వస్తోందని మార్కాపురం జిల్లా ప్రజలు చెబుతున్నారు. దీంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయి ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు.
నెగిటివ్ బ్లడ్ కోసం తిప్పలు...
కాస్త ప్రయత్నిస్తే పాజిటివ్ రక్తం దొరుకుతుంది కానీ ఎంత ప్రయత్నించినా నెగిటివ్ రక్తం దొరకడం కష్టమవుతోంది. ప్రస్తుతం జీజీహెచ్‌లో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు మొత్తం కలుపుకొని కేవలం 5 యూనిట్ల నెగిటివ్ రక్తం మాత్రమే నిల్వలున్నాయి. రెడ్ క్రాస్‌లో ఏ నెగిటివ్ 1, ఓ నెగిటివ్ 1 యూనిట్ మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు బ్లడ్ బ్యాంకు న్యూ విజన్‌లో అయితే ఓ నెగిటివ్ 1 యూనిట్ ఉండగా మిగతా ఏ, బీ, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం నిల్వలు లేవు. దాంతో నెగిటివ్ రక్తం అవసరమైతే దాతలను వెదుక్కోవాల్సి వస్తోంది. అరుదైన ఏబీ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కోసం ఒక్కోసారి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఎంత డబ్బు వెచ్చించినా ఏబీ నెగిటివ్ రక్తం దొరికే వరకు గ్యారంటీ ఉండడంలేదని తెలుస్తోంది.


