కాసుల కుప్పలు..!
ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సహజ సంపద దోపిడీ మంత్రుల ఇలాకాలో అంతులేని దోపిడీ పట్టపగలే కొండలను పిండిచేస్తున్న పచ్చమూకలు గిద్దలూరు, కొండపి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు నియోజకవర్గాల్లో కొండలు మాయం అద్దంకిలో పురాతన సమాధులను వదిలిపెట్టకుండా తవ్వకాలు గిద్దలూరులో కప్పం కట్టకుండా మట్టితోలితే పోలీసు కేసులతో వేధింపులు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు
చెరువులు..గుట్టలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెరువు కనిపిస్తే చాలు జేసీబీలతో గద్దల్లా వాలిపోతున్నారు. కీలక నేతలకు నైవేద్యం సమర్పిస్తుండడంతో మట్టి దొంగలకు వారు అండగా నిలబడుతున్నారు. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తవ్వుకుంటూ ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రెట్టింపు ధరలకు మట్టిని విక్రయించారు. ఏడాది తరువాత మరింతగా రెచ్చిపోయారు. తాజాగా మూడింతలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సామాన్యులకు మట్టి దొరకడం గగనమై పోయింది. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కావడంతో పశ్చిమాన మట్టికి రెక్కలొచ్చాయి. అధికారులు, నాయకులు కుమ్మకై ్క మట్టిని మింగేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
సమాధులను కూడా తవ్వేస్తున్న తమ్ముళ్లు...
జిల్లాలో కీలక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చెరువులు, కొండలను వదిలిపెట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తిరగబడ్డారంటే పరిస్థితులు ఎంతగా శ్రుతిమించాయో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. అద్దంకి, మద్దిపాడు మండలాల సరిహద్దుల్లోని ధేనువకొండ గ్రామంలో పురాతన సమాధులున్నాయి. క్రీస్తు పూర్వం నాటి ఈ సమాధులను కూడా వదిలిపెట్టకుండా తవ్వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డవరం, పేరాయపాళెం దారిలో ఉన్న రెండు కొండలను భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. దీంతో ఈ కొండలు కనిపించకుండా పోయే రోజులు ఎంతో దూరంలో లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తవ్వకాలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇటువైపు తొంగిచూసేందుకు సాహసించడం లేదని ఆరోపిస్తున్నారు. జె.పంగులూరు మండలంలో కొండమూరు చెరువు ఎర్రమట్టి దిబ్బలను తవ్వుకుంటుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడ తవ్వకాలు ఆగిపోయాయి.
వల్లూరు చెరువులో రోజుకు వంద టిప్పర్ల మట్టి మాయం...
జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న మరో మంత్రి సొంత నియోజకవర్గం కొండపిలో మట్టి దొంగలు పడ్డారు. టంగుటూరు మండలంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న వల్లూరు చెరువులో ఎటువంటి బెరుకు భయం లేకుండా పట్టపగలే మట్టిని తవ్వకొంటున్నా అధికారులకు పట్టడంలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులకు అవసరమైన మట్టిని మూడు అడుగుల లోతు వరకు తవ్వుకునేందుకు తీర్మానం చేశారు. ఇందుకు విరుద్ధంగా నియోజకవర్గ పెద్దల అండదండలతో పచ్చదండు 10 నుంచి 15 అడుగుల లోతు వరకు తవ్వేసుకుంటున్నారని సమాచారం. రోజుకు 100 టిప్పర్ల వరకు మట్టిని తవ్వేసి తోలుకొని పోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.9 వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రోజుకు లక్ష రూపాయల మట్టిని కొట్టుకొని పోతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదని స్థానికులు వాపోతున్నారు. సింగరాయకొండ పరిధిలోని పాత సింగరాయకొండ, సోమరాజుపల్లి, టంగుటూరు పరిధిలోని కొణిజేడు, ఒంగోలు, టంగుగూరు సరిహద్దులోని యరజర్ల కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులో ఫలానా నేత తాలుకా పేరుతో రాసి ఉన్న ట్రాక్టర్లలో మట్టి తరలిపోతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం బూరేపల్లి కొండను టీడీపీ నాయకులు కొల్లడొడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గానికి చెందిన కీలక నేత కనుసన్నల్లో మట్టి వ్యాపారం జరుగుతుందని సమాచారం. గ్రావెల్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకున్న ఓ మండల ముఖ్యనాయకుడు పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అడ్డుకోకుండా చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో బూరేపల్లి కొండ కనుమరుగైపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
గిద్దలూరులో బెదిరింపుల పర్వం...
పశ్చిమ ప్రకాశంలో నిత్యం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు బరితెగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కీలక నాయకుడికి కప్పం చెల్లించకుండా మట్టిని అమ్ముకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఒక మట్టి వ్యాపారిని బెదిరించిన ఆడియో కలకలం రేపుతోంది. మామతో మాట్లాడి సెటిల్ చేసుకో..లేకపోతే నీ ట్రాక్టర్‌ను సీజ్ చేయిస్తానంటూ సదరు వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియోజకవర్గంలోని బేస్తవారిపేట సాయిబాబా గుడి సమీపంలో కొండ నుంచి మట్టిని తోలుకొని పోతున్నారు. కంభం మండలంలో ఏనుగుకొండ, చిన్న కంభం పరిసర ప్రాంతాల నుంచి పట్టపగలే మట్టిని తోలేస్తున్నారు. కొమరోలు, ఇడమకల్లు, గోనపల్లె, కృష్ణంపల్లె, తాటిచర్ల, అక్కపల్లె, రెడ్డిచెర్ల నుంచి అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారు. అర్ధవీడు మండలంలోని నాగులవరం కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు.
కొత్త జిల్లాలో మట్టి కొట్టుకొనిపోతున్న తమ్ముళ్లు...
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడడంతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా మట్టి వ్యాపారం జోరందుకుంది. తర్లుపాడు రోడ్డులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల పొలాలు, ఇతర భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్న రియల్టర్లు పొలాలను చదును చేయడానికి మట్టిని తరలిస్తున్నారు. దీంతో మట్టికి గిరాకీ పెరిగింది. ట్రాక్టర్ మట్టిని 1000 రూపాయలకు, టిప్పర్ మట్టి రూ.5 వేల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. యర్రగొండపాలెంలో రాత్రి 9 గంటలు దాటితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టిని తరలించుకొని పోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. అధికారులు తాత్కాలికంగా తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాలు ఇవ్వడంలేదు. అధికార పార్టీ నాయకులే మట్టి వ్యాపారం చేస్తుండడంతో అడ్డుకునే పరిస్థితులు లేకుండా పోయాయని ప్రజలు చెబుతున్నారు.


