విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ రాజకీయం

Feb 3 2026 7:13 AM | Updated on Feb 3 2026 7:13 AM

విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ రాజకీయం

విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ రాజకీయం

జరగని కల్తీని, అబద్ధపు ప్రచారంతో ఫ్లెక్సీల ఏర్పాటు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం చంద్రబాబు ప్రభుత్వంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

ఒంగోలు సిటీ: టీటీడీకి సరఫరా అయిన నెయ్యిలో కుంభకోణం జరిగిందని చెప్తూ ఏ సంబంధం లేని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ.సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మీద దుష్ప్రచారం చేస్తూ అన్నీ చోట్ల కావాలనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒంగోలు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడు రోజుల నుంచి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగిరమేష్‌ ఇళ్ల మీద దాడిచేసి భౌతికంగా, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పడం దుర్మార్గమన్నారు. ఏ రిపోర్టులు లేకుండా కావాలనే ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగిందని వేయడం ఏమిటని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవారన్నారు. అటువంటి ఆయన ఇంటిమీద, ఆఫీసు మీద, జోగి రమేష్‌ ఇంటి మీద దాడి చేయడం బాధాకరమన్నారు. వైఎస్సార్‌ సీపీ ఆదేశాల మేరకు దేవుడి గుడిలో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో భాగంగా రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు ఆయన వాహనం ముందు రాడ్లు, కర్రలతో టీడీపీ నాయకులు వచ్చి అతని కారుపై దాడి చేశారన్నారు. ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగాడివి అయితే బయటికి రా ఫ్లెక్సీ ఎట్లా చించుతావో చూస్తాం అంటూ అసభ్యపదజాలంతో దూషించి కారు మీద కొట్టిందన్నారు. టీడీపీ నాయకులు గొడవ చేస్తున్నా పోలీసులు ఉండి కూడా ఏమీ చేయకుండా చోద్యం చూశారని విమర్శించారు. కావాలనే టీడీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తించి ఆ ఇంటిమీద దాడులు చేసి కారు అద్దాలు పగులగొట్టారన్నారు. పోలీసులు ఉన్నా, పక్కనే కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉన్నా, పోలీసు పహారాలో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేయడం కన్నా దుర్మార్గం మరొకటి లేదని విమర్శించారు. లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారన్నారు.

కాపు నాయకులపై దాడులు బాధాకరం:

టీడీపీ నాయకులు కావాలనే దాడులు చేస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలకు అవకాశమిస్తున్నారని బూచేపల్లి మండిపడ్డారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏ పాపం చేశారని ఆ రోజుల్లో పోలీసుల చేత దాడి చేయించారని ప్రశ్నించారు. కాపుల ఐక్యత కోసం, కాపుల పోరాటం కోసం, కాపులకు రిజర్వేషన్‌ కావాలని ముద్రగడ పద్మనాభం పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కాపు నాయకులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో పోలీసుల సమక్షంలో ఐదారు గంటల సేపు అంబటి రాంబాబు పై దాడి చేయడం బాధాకరమన్నారు.

రెండేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్సే..

చంద్రబాబు గత రెండేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్సే చేస్తున్నారని బూచేపల్లి విమర్శించారు. కల్తీ నెయ్యి, మెడికల్‌ కాలేజీల పేరుతో మరొక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, మీడియాను డైవర్ట్‌ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించి వైఎస్సార్‌సీపీ నాయకులపై, బీసీ నాయకులపై, కాపు నాయకులపై దాడులు చేయడంతోనే సరిపోయిందన్నారు. భౌతికంగా దాడి చేస్తే తప్పా వైఎస్సార్‌ సీపీ నాయకులు లొంగరని అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని భౌతిక దాడులు చేసినా ఎవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆరు నెలల నుంచి లడ్డులో కల్తీ నెయ్యి అని మీ రాజకీయాల కోసం పవిత్రమైన వెంకటేశ్వరస్వామిని వాడుకుంటున్నారని, మిమ్మల్ని ఆ దేవుడు వదలడన్నారు. శాంతిభద్రతలు క్షీణించిన ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ చేసే సమయంలో ఈ ఫ్లెక్సీలన్నింటినీ తొలగించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు గౌతమ్‌ అశోక్‌, మల్లిశెట్టి దేవా, షేక్‌ అప్సర్‌, దేవరపల్లి అంజిరెడ్డి, దేవరపల్లి రామసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement