ఆదాయం బీకే త్రషర్స్‌కు.. రోగాలు ప్రజలకు
సింగరాయకొండ: ఆదాయం మాకు..రోగాలు మీకు అన్నట్లుగా ఉంది సింగరాయకొండ మండలంలోని కలికవాయ పంచాయతీ పరిధిలో ఉన్న బీకే త్రషర్స్ కంపెనీ తీరు. గత అక్టోబర్‌లో కంపెనీలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లగా కోటి కేజీల పొగాకు దగ్ధమైంది. ప్రస్తుతం కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ నుంచి ఆ వ్యర్థాలను తరలించే పనిలో నిమగ్నమైంది. కానీ, ఆ వ్యర్థాలను సరైన నిబంధనలు పాటించి జనావాసాలకు దూరంగా ఖాళీ స్థలాల్లో డంప్ చేయాల్సి ఉండగా, ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా పాలేరు నదిలో, మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని జువ్వలగుంట ఇరిగేషన్ చెరువులో, జాతీయ రహదారి పక్కన డంప్ చేయటంతో పాటు వెంటనే ఆ వ్యర్థాలను తగలబెడుతూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. దీని వలన పాలేరులో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండగా జువ్వలగుంట చెరువు సమీపంలోని ఎస్సీ కాలనీవాసులు విషపూరితమైన వాయుకాలుష్యం కారణంగా రోగాల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ట్రాక్టర్ల ద్వారా
పొగాకు వ్యర్థాల తరలింపు...
కంపెనీ వారు వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట సమీపంలోని పాలేరు బ్రిడ్జి కింది ప్రాంతంలో నది ఒడ్డున, జాతీయ రహదారి పక్కన, మూలగుంటపాడు పంచాయతీ జువ్వలగుంట చెరువు వద్ద డంప్ చేస్తున్నారు. ఈ వ్యర్థాలను కూలీలచే తగలబెట్టించి వాయు కాలుష్యానికి కారణమవు తున్నారు. ఈ పొగాకు వ్యర్థాలు తగలబెట్టడం వలన విషపూరిత వాయువులు వెలువడి వాయు కాలుష్యం అవుతోందని, ఈ వాయువులను పీల్చితే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఈ వ్యర్థాలు చెరువులో కలిస్తే నీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ చెరువు సమీపంలో ఎస్సీలు నివసిస్తున్న వెంకటేశ్వరకాలనీ, రాజులకాలనీ ఉన్నాయి. గతంలో కూడా ఈ వ్యర్థాలను వేసినప్పుడు పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. అయినా పంచాయతీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యర్థాలను చెరువులో డంప్ చేస్తున్నారు. అంతేగాకుండా ఈ చెరువులో రక్షిత మంచినీటి పథకం సంప్ కూడా ఉంది.
రాంగ్ రూట్‌లో వ్యర్థాల తరలింపు...
బీకే త్రషర్స్ కంపెనీ నుంచి మూలగుంటపాడులోని జువ్వలగుంట చెరువుకు వ్యర్థాలను ట్రాక్టరులో జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వేగంగా డ్రైవర్లు తరలిస్తున్నారు. దీంతో ఒంగోలు వైపు వెళ్లే వాహనదారులు ఈ ప్రాంతానికి వచ్చేసరికి నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి వస్తోంది. ఏమాత్రం ఆదమరిచినా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం నెలకొంది. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ వారు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఒకవేళ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని వాహనదారులు హైవే పెట్రోలింగ్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
సంపదను కాల్చేస్తున్నారు...
వాస్తవానికి కలికవాయ పంచాయతీ పరిధిలో ఉన్న కంపెనీ వ్యర్థాలను ఆ గ్రామంలోని డంపింగ్ యార్డు కు తరలించాలి. కానీ, అలా చేయకుండా సమీపంలోని చెరువులో వ్యర్థాలు వేస్తున్నారు. వ్యర్థాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న కంపెనీ వారి గురించి గ్రామ పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, చెత్త నుంచి సంపద సృష్టిస్తామని మాటలు తప్ప చేతల్లో అమలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస జాగ్రత్తలు పాటించకుండా వ్యర్థాలు తరలించి తగలబెడుతున్న కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పొగాకు వ్యర్థాలను తీసుకొచ్చి జువ్వలగుంట చెరువులో డంప్ చేస్తున్న ట్రాక్టర్
బీకే త్రషర్స్ కంపెనీ నుంచి జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో పొగాకు వ్యర్థాలు తరలిస్తున్న ట్రాక్టర్
పాలేరు ఒడ్డున డంప్ చేసి తగలబెట్టిన వ్యర్థాలు
జాతీయ రహదారి పక్కన డంప్ చేసిన వ్యర్థాలు
గత అక్టోబర్‌లో బీకే త్రషర్స్‌లో భారీ అగ్నిప్రమాదం
సుమారు రూ.600 కోట్ల విలువైన కోటి కేజీల పొగాకు దగ్ధం
పొగాకు వ్యర్థాలను తరలించడంలో కంపెనీ నిర్లక్ష్య వైఖరి
వ్యర్థాలను ట్రాక్టరు ద్వారా పాలేరు, చెరువులకు తరలింపు
వ్యర్థాల కారణంగా కలుషితమవుతున్న నీరు
తరలించిన వ్యర్థాలను తగలబెట్టడంతో పర్యావరణ సమస్యలు
నిస్సహాయస్థితిలో ఇరిగేషన్, హైవే పోలీసులు
ఆదాయం బీకే త్రషర్స్‌కు.. రోగాలు ప్రజలకు
ఆదాయం బీకే త్రషర్స్‌కు.. రోగాలు ప్రజలకు
ఆదాయం బీకే త్రషర్స్‌కు.. రోగాలు ప్రజలకు
ఆదాయం బీకే త్రషర్స్‌కు.. రోగాలు ప్రజలకు


