భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి! | - | Sakshi
Sakshi News home page

భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!

Jan 24 2026 7:10 AM | Updated on Jan 24 2026 7:10 AM

భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!

భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!

పెద్దారవీడు:

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణం, ఎక్కడ తనను భర్త అంతమొందిస్తాడోనన్న భయంతో కట్టుకున్నవాడినే కాటికి పంపంది ఆ మహిళ. గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు బెయిల్‌ ఇప్పించి మరీ కిరాయి హంతకులతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. ఇందుకు సొంత తమ్ముడితోపాటు సన్నిహితుడి సహకారం తీసుకుంది. పెద్దదోర్నాలకు చెందిన యువకుడు లాలూ శ్రీను మర్డర్‌ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయి. హత్య జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. శుక్రవారం పెద్దారవీడు పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు పూర్వాపరాలను డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. పెద్దదోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పేకాటకు అటవాటు పడి డబ్బు నష్టపోయాడు. పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా పెద్దదోర్నాలో మెకానిక్‌ షాపు నడుపుతున్న మృతుడి బావమరిది అశోక్‌కుమార్‌ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు. పక్కనే కూల్‌డ్రింక్‌ పాపు నిర్వహిస్తున్న అశోక్‌ సోదరి ఝాన్సీతోనూ పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి చర్యలను గమనించిన లాలూశ్రీను భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గంజాయితో పట్టుబడిన లాలూశ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తాడని ఆందోళన చెందిన ఝాన్సీ, సన్నిహితుడు సూర్యనారాయణ, సోదరుడు అశోక్‌కుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించింది. భర్తను అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్థు, శంకర్‌కు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. ఒంగోలు సబ్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న భర్త లాలూశ్రీనుకు బైయిల్‌ వచ్చేలా చేయడంతోపాటు అతడిని కారులో దోర్నాలకు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు. తొలుత చీమకుర్తి వద్ద శ్రీనును హతమార్చాలని చూసినా అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. ఆ తర్వాత శ్రీను కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కత్తులతో దారుణంగా హతమార్చారు. నిందితులు ఝాన్సీ, అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో త్రిపురాంతకం సీఐ హసన్‌, ఎస్సై సాంబశివయ్య పాల్గొన్నారు.

పెద్దదోర్నాల యువకుడు శ్రీను హత్యలో

భార్య, బావమరిది హస్తం

మరో వ్యక్తితో భార్య సన్నిహితంగా ఉండటాన్ని ప్రశ్నించిన భర్త

భర్తను హతమార్చేందుకు ఇద్దరికి

రూ.2 లక్షల సుపారీ

గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు

బెయిల్‌ ఇప్పించిన భార్య

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

హత్య కేసు వివరాలు వెల్లడించిన

మార్కాపురం డీఎస్పీ నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement