రిపబ్లిక్ డే, రథ సప్తమి ఘనంగా నిర్వహించండి
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం: ఈనెల 25న మార్కాపురంలో జరిగే రథసప్తమి, ఓటర్ల దినోత్సవం, 26న జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేరోజున మార్కాపురంలో జరిగే రథ సప్తమి వేడుకలను కూడా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు అధికారులను ఆదేశించారు. వేల సంఖ్యలో భక్తులు వస్తున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల విషయంలో స్వామివారి రథం తిరిగే సమయంలో విద్యుత్‌శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఏర్పడిన తరువాత మొదటి సారి జరుగుతున్న రిపబ్లిక్‌డే వేడుకలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని, వేడుకలను చూసేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జేసీ ఆదేశించారు. సమీక్షలో సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, తహశీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, ఏఈఎస్ బాలయ్య, ఫైర్ ఆఫీసరు రామకృష్ణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


