అనుమానాస్పద మృతిపై చెలరేగిన వివాదం | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద మృతిపై చెలరేగిన వివాదం

Jan 24 2026 7:11 AM | Updated on Jan 24 2026 7:11 AM

అనుమానాస్పద మృతిపై చెలరేగిన వివాదం

అనుమానాస్పద మృతిపై చెలరేగిన వివాదం

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి కొమరోలులో అనుమానాస్పద మృతి మృతిపై పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు

కొమరోలు/మార్కాపురం: మండల కేంద్రమైన కొమరోలులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందడంపై పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు చెలరేగాయి. కొమరోలులోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌ వీధిలో ఉన్న మహీ ఫ్యాషన్స్‌ బొటెక్‌లో ఈనెల 1వ తేదీ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన మొంజుల రామ్‌ లస్కార్‌ (43) పనికి కుదిరాడు. ఈనెల 1వ తేదీ బొటెక్‌లో పని నిమిత్తం కంభం నుంచి కొమరోలుకు వచ్చాడు. గత 20 రోజులుగా జాకెట్లకు, చీరలకు డిజైన్‌ వర్క్‌ చేస్తూ బొటెక్‌లోనే ఉండసాగాడు. ఈనెల 19వ తేదీ లస్కార్‌ రాత్రి మద్యం తాగి దుకాణంలో ఉన్న చీరలను బ్యాగ్‌లో సర్ది పారిపోయే యత్నం చేస్తూ మెయిన్‌ రోడ్డుపై కిందపడ్డాడు. స్థానికులు చూసి దుకాణ యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని లస్కార్‌ను దుకాణానికి తరలించాడు. 20వ తేదీ ఉదయం లస్కార్‌ దుకాణంలోనే మృతిచెంది ఉండడాన్ని గమనించిన దుకాణ యజమానులు వెంటనే ఆ సమాచారాన్ని అతని బంధువులకు, స్థానిక పోలీసులకు తెలిపారు. ఎస్సై నాగరాజు దుకాణం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన వివాదం

లస్కార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా పశ్చిమ బెంగాల్‌ వాసి కావడంతో అతని బంధువులు అక్కడి నుంచి కొమరోలుకు చేరుకుని గిద్దలూరుకు ఈనెల 21వ తేదీ పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్లారు. లస్కార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండడం, బంధువులకు అతని మృతిపై అనుమానాలు ఉండడంతో అనుమానాస్పద మృతిని ఛేదించాలంటూ అక్కడ ఆందోళన చేపట్టారు.

హత్యకేసుపై నిస్పక్షపాత దర్యాప్తు: సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు వెల్లడి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, ఉత్తర బిష్ణుపూర్‌ జిల్లా 24 పరగణాలలోని మగ్రహత్‌ 1 ప్రాంతానికి చెందిన మొంజుల రామ్‌ లస్కార్‌ అనే వ్యక్తి మార్కాపురం జిల్లా కొమరోలులో ఈనెల 20న అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతోందని మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ శివరామిరెడ్డి, డీఎస్పీ యూ నాగరాజు వెల్లడించారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మృతుడు మొంజుల రామ్‌ లస్కార్‌ తన మిత్రులతో కలిసి నాలుగేళ్ల క్రితం కంభం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో మగ్గం పనులు చేస్తూ జీవిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ నుంచి లస్కర్‌ కొమరోలు టౌన్‌లోని మహీ ఫ్యాషన్‌ షాప్‌నకు వచ్చి అక్కడ మహేశ్వరి వద్ద మగ్గం పనులు చేసే పనిలో కుదిరాడని చెప్పారు. అయితే ఈనెల 19న ఉదయం లస్కార్‌ మద్యం తాగి భోజనం కూడా సరిగా చేయకుండా తిరిగాడని, అదే రోజు రాత్రి తన గదిలో పడుకొని నిద్రపోయాడని, మరుసటిరోజు అనగా ఈనెల 20న ఉదయం నిద్రలేవకపోయేసరికి షాపు ఓనరు మహేశ్వరికి అనుమానం వచ్చి తన భర్తకు విషయం చెప్పిందన్నారు. దీంతో లస్కార్‌ను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారన్నారు. ఈ సంఘటనపై మృతుని స్నేహితుడు సద్దాం హుస్సేన్‌ పోలీసు స్టేషన్‌లో రామ్‌ లస్కార్‌ మరణంపై విచారణ జరపాలని ఫిర్యాదు చేయడంతో 21న మృతదేహానికి మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుమార్టం నిర్వహించి శరీరంలోని ఆర్గాన్స్‌ని నిపుణుల అభిప్రాయాల నిమిత్తం భద్రపరిచినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుడు అతిగా మద్యం తాగడం వలన గొంతు ఎండిపోయిగానీ లేక గుండెపోటుతో గానీ చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement