జ్వరాల పంజా | - | Sakshi
Sakshi News home page

జ్వరాల పంజా

Nov 17 2025 10:17 AM | Updated on Nov 17 2025 10:17 AM

జ్వరాల పంజా

జ్వరాల పంజా

ఒంగోలు టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజారోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్‌సీలు, పట్టణ శివారు ప్రాంత ప్రజలకు వైద్య సేవలందించాల్సిన అర్బన్‌ వైద్యశాలలను పట్టించుకోకపోవడంతో సక్రమంగా వైద్యం అందడం లేదు. నిన్నమొన్నటి వరకు పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలో ఉండడం, ఆరోగ్య శ్రీ సేవలను ఆస్పత్రుల్లో నిలిపేయడంతో జిల్లాలో వైద్య సేవలు స్తంభించి గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మోంథా తుపాను ప్రభావంతో వారం రోజుల పాటు వర్షాలు కురిశాయి. పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ, వైద్యారోగ్య శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల మధ్య సమన్వయం కొరవడంతో పారిశుధ్యం లోపించడం, మంచినీరు కలుషితం కావడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా సీజనల్‌ వ్యాధులతో పాటు డెంగీ, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు చాపకింద నీరులా ప్రబలుతున్నాయి. విషజ్వరాల బారిన పడిన జనాలు ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు.

చాపకింద నీరులా డెంగీ..

తుపాను కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీల్లో ఇప్పటికీ నీరు నిలిచే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ పట్టించుకునే నాథుడే లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో దోమలు పెరిగి ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. ఇటీవల ఒంగోలు నగరంలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు డెంగీ జ్వరాలతో వచ్చినట్లు సమాచారం. సుందరయ్య రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి శుక్రవారం మరో ఇద్దరు వ్యక్తులు డెంగీ జ్వరాలతో వచ్చినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌ నెలలో కంభం మండలంలోని పెదనల్లకాల్వ గ్రామంలో సుమారు 50 మంది చిన్నారులు జ్వరాల బారిన పడడడం కలకలం సృష్టించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో సగం మంది జ్వరాల బారిన పడినా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఏమాత్రం స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. గ్రామానికి చెందిన ఎస్‌.ఫెబీ, దీప్తి డెంగీ జ్వరంతో కంభం ఆస్పత్రికి వెళితే అక్కడ నుంచి వారిని మార్కాపురానికి తరలించారు. ఎల్‌.సంధ్య అనే చిన్నారికి కూడా డెంగీ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రవీణ, అరవింద్‌, ఖాశీం బీ లకు కూడా డెంగీ జ్వరం సోకడంతో మార్కాపురం వైద్యశాలలో చికిత్స తీసుకున్నారు. అయినా జిల్లా వైద్యాధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడా డెంగీ కేసులు నమోదు కాలేదని చెప్పడం గమనార్హం. ఒకేసారి పదుల సంఖ్యలో చిన్నారులు జ్వరాల బారిన పడినా వైద్యారోగ్య శాఖ ఎలాంటి మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయలేదు.

కనిగిరిలో పచ్చకామెర్ల కలకలం...

కనిగిరి నియోజకవర్గంలోని బడుగులేరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఇటీవల అనారోగ్యం బారిన పడ్డారు. తుపాను సెలవుల తరువాత బడికి వచ్చిన 13 మంది విద్యార్థులకు జ్వరం, వాంతులు, విరేచనాలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు కోలుకున్నా మిగతా 9 మంది విద్యార్థులకు కామెర్లు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన బ్లెస్సి, రేచల్‌, మరో కుటుంబంలోని తరుణ్‌, జయకుమార్‌, రాణి, మరో విద్యార్థి కొండ్రు జగన్‌ విక్కి, షర్లీ కామెర్లకు చికిత్స తీసుకున్నారు. అంతకుముందు కూడా ఇదే పాఠశాలకు చెందిన 9, 10 తరగతులకు చెందిన ముగ్గురు విద్యార్థులకు కూడా కామెర్లు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రామంలో మంచినీటి కాలుష్యం ఏర్పడడంతో పాటుగా ఆహార కాలుష్యం వలన కామెర్ల వ్యాధి వచ్చినట్లు వైద్యులు చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement