రజకులకు అందని ప్రభుత్వ పథకాలు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో 25 లక్షల మంది రజకులు ఉన్నా ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూర్ భాస్కరయ్య చెప్పారు. ఆదివారం ఎల్బీజీ భవనంలో నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్‌లో పేరుకు మాత్రమే చైర్మన్, డైరక్టర్ పదవులను నియమించారే కానీ ఎలాంటి విధివిధానాలను రూపొందించకపోవడంతో వారు ఊరికే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల రుణాలు ఇస్తామన్నారని, ఆదరణ ద్వారా పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు వాటి జాడలేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వసతులతో దోభీ ఘాట్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటికీ పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారని, ఇప్పుడు అతీగతీ లేదన్నారు. రజక వృత్తిదారులు గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలస వచ్చి రకరకాల పనులు చేస్తున్నా వారికి మౌలిక వసుతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటిన రజక వృత్తిదారులకు పింఛన్లు, నివాస గృహాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో ఇసీ్త్రదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయల మాలకొండయ్య, ఆవులమంద రమణమ్మ, రాచకొండ వెంకట కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, రేకుల గుంట అంకయ్య, ఎం.శ్రీనివాసులు, కొండయ్య, పెదకాశయ్య, మల్లికార్జున , హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


