వైఎస్సార్ సీపీ కార్యాలయంపై దాడి అప్రజాస్వామికం
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి
ఒంగోలు సిటీ: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేసి అద్దాలు, ఫర్నిచర్, విగ్రహాలు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని పార్టీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడ్డొచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కొట్టడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు సమాజానికి ముప్పు అన్నారు. టీడీపీ వారు ఎందుకింత నీచ రాజకీయాలు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై, పార్టీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో ఈ సంఘటనకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


