జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
పార్టీ కోసం పనిచేసిన వారిని గాలికొదిలేశారంటున్న ఓ వర్గం ఖాళీ కుర్చీకి జనసేన పార్టీ ఇన్చార్జ్ అని అంటించి స్టేజీపైన ఉంచిన వైనం
కంభం: గిద్దలూరు జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సమయంలో ఆమంచి స్వాములు కొన్ని రోజులు గిద్దలూరు నియోజకవర్గంలో తిరిగిన నేపథ్యంలో జనసేన పార్టీలోని కొందరు నేతలు ఆయనకు మద్దతుగా తిరిగిన విషయం విదితమే. అనంతరం టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల కాలంలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో, ఇతర పనుల్లో ఆమంచి స్వాములు వర్గంలో తిరిగిన వారికి కాకుండా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జ్‌గా ఉన్న బెల్లంకొండ సాయిబాబ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ రావడంతో జనసేన పార్టీలో స్వాములు వర్గంగా గుర్తింపు పొందిన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని వారి భవిష్యత్ కార్యాచరణలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఖాళీ కుర్చీకి గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ అని అంటించి దాన్ని స్టేజీపైన పెట్టి వారికి ఇన్చార్జ్ పై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన పలువురు నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవిలో ఉన్న నాయకులు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా, వారికి కావాల్సిన పదవులు, వారికి బందువులకు కావాల్సిన పదవులు తీసుకొని పార్టీ కోసం కష్టపడిన జనసైనికులను గాలికొదిలేశారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా తమకు ఎటువంటి న్యాయం జరగడం లేదని నీటి సంఘాల చైర్మన్, దేవాలయాల చైర్మన్, స్కూల్‌చైర్మన్, ఇతర పదవుల్లో తమకు న్యాయంగా ఇవ్వాల్సిన 30 శాతం వాటా అడిగితే కనీసం 5–10 శాతం వాటా కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు పట్టున్న స్థానాలను కేటాయించాలని, అందుకోసం ఆరు మండలాల్లోని నాయకులు కలసి సమీక్షించుకొని తమకు న్యాయం చేయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో రాచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ, కంభం మండల జనసేన కార్యదర్శి కర్ణశివ, నరేంద్ర, చందు, సూరే ప్రసాద్, అర్థవీడు మండల నాయకుడు రాజుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.


