అందరి మేలు కోరేవారే రెడ్లు | - | Sakshi
Sakshi News home page

అందరి మేలు కోరేవారే రెడ్లు

Nov 17 2025 10:17 AM | Updated on Nov 17 2025 10:17 AM

అందరి మేలు కోరేవారే రెడ్లు

అందరి మేలు కోరేవారే రెడ్లు

వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

మద్దిపాడు: రెడ్డి అంటే అన్ని కులాలను సమానంగా చూసేవారని, అందరి మేలు కోరేవారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. మల్లవరం సమీపంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్ద రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెడ్డి అంటే పరిపాలించే వాడని అన్నారు. తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలనే తత్వం రెడ్డి కులానికి మెండుగా ఉంటుందని అన్నారు. తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి, తల్లి బూచేపల్లి వెంకాయమ్మల పేరు మీద ట్రస్ట్‌ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్‌కు తగు సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగామని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం పనిచేయడం అభినందనీయమన్నారు. రెడ్డి కులస్తులు తమవారినే కాకుండా చుట్టుపక్కల ఉండేవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారని, అలాంటి తత్వమే తనకు అబ్బిందన్నారు. ప్రజలకు మంచి చేయటానికి తమ కుటుంబం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు పదిమంది రెడ్డి కులానికి చెందినవారు ముఖ్యమంత్రులు అయ్యారని, వారిలో నీలం సంజీవరెడ్డి ఏకంగా రాష్ట్రపతి అయ్యారని ఇందుకు వారు ప్రజలకు చేసిన మేలు, వారి పరిపాలన దక్షతలే కారణమన్నారు. వందల సంవత్సరాలుగా పరిపాలన చేసే వారిని రెడ్డి అని పిలుస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. రెడ్డి సోదరులందరూ ఐకమత్యంగా ఉండి సోదర భావంతో మెలుగుతూ మనకు మేలు చేసే వారిని గుర్తిస్తూ వారిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి గుండ్లకమ్మ పై నిర్మించిన కందుల ఓబుల్‌ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంతమంది రెడ్డి సోదరులను కలుసుకోవడం తనకు మరచిపోలేని అనుభూతినిస్తుందని అన్నారు. ఒంగోలులోని రెడ్డి హాస్టల్‌ కు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రెడ్డిల పూర్వ వైభవం గురించి, బ్రిటిష్‌ వారికి ఎదురు తిరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వివరించారు.

ముందుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థుల కోలాటం ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్తీక వనభోజనాలకు వచ్చిన వారు మల్లవరం వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పార్కులలో సందడి చేశారు. కార్యక్రమంలో పీడీసీసీబీ మాజీ చైర్మన్‌లు మేదరమెట్ల శంకరా రెడ్డి, వైఎం.ప్రసాద్‌ రెడ్డి (బన్నీ), ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి, కేవీ రమణారెడ్డి, బాలినేని ప్రణీత్‌ రెడ్డి, పీ శంకరరెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, హెచ్‌ఎంపాడు ఎంపీపీ సావిత్రి, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, నాగులుప్పలపాడు ఎంపీపీ నల్లమలకు అంజమ్మ కృష్ణారెడ్డి, ముండ్లమూరు ఎంపీపీ సుంకర బ్రహ్మారెడ్డి, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంప రమణమ్మ, పలువురు నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement