
పశువులంటే ప్రాణం.. బీమా ఇవ్వం!
గత వైఎస్సార్ సీపీ
ప్రభుత్వంలో మెరుగ్గా..
‘తమ్ముళ్లూ.. ఇన్నాళ్లు మీరు విద్యార్థులు, యువత, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు చూసి ఉంటారు. ఇకపై మీ గ్రామాల్లోనే పశువుల హాస్టళ్లు చూస్తారు. పశువులన్నీ ఒకేచోట ఉండేలా హాస్టల్ పెడతాం. వాటిని అప్పుడప్పుడూ వెళ్లి యజమానులు చూసుకోవచ్చు’’ ఇవీ ఇటీవల ఓ సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.. ఇవి విన్న జనమంతా పశువులకు హాస్టళ్లేంటో అని జుట్టు పీక్కున్న పరిస్థితి. పశువులంటే తనకు అంత ప్రాణమని సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించినప్పటికీ అవి ప్రమాదాల్లో మృతి చెందితే బీమా వర్తింపజేస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పశు బీమా పథకానికి సైతం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా తూట్లు పొడవడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బేస్తవారిపేట:
ఊహించని విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, విద్యుదాఘాతాలు, పిడుగుపాటుతో పశువులు మృత్యువాత పడితే, వాటిని చంటి బిడ్డల్లా సంరక్షించే యజమానులు అనుభవించే బాధ వర్ణణాతీతం. పాడి పైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకునే వారు పశువుల మరణాన్ని జీర్ణించుకోలేరు. మృత్యువాత పడిన పశువులకు బీమా లేకపోతే ఆ రైతులు ఆర్థికంగా చితికిపోవాల్సిందే. ఈ నేపథ్యంలో రైతుల సమస్యపై సహృదయంతో స్పందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేరుగా పశు బీమా పథకాన్ని అమలు చేసింది. 2019కు ముందు వరకు పశు బీమా పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలోనే నిర్వహించగా ఆ విధానానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ స్వస్తి పలికారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్లపాటు ప్రమాదాల్లో మృతి చెందిన పశువులకు వైఎస్సార్ పశు నష్ట పరిహారం అందించారు. 2022లో ప్రభుత్వ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి పాడి రైతులకు మరింత మేలు చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పశు బీమా పథకాన్ని పాడి రైతులకు దూరం చేసేలా నిబంధనలను సవరించింది. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా పథకాన్ని గాలికొదిలేసింది. పాడి రైతులపై అధిక ప్రీమియం భారాన్ని మోపడంతో బీమా చేయించుకునేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితి. ఈ క్రమంలో పశువులు మృత్యువాత పడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
జిల్లాలో తెల్ల పశువులు 56,332, నల్ల పశువులు 6,71,812, గొర్రెలు 15,67,122, మేకలు 4,17,589 ఉన్నాయి. గత ప్రభుత్వంలో పశుసంవర్థకశాఖ అధికారులు పాడిరైతుల వద్దకు వెళ్లి బీమా పథకంపై అవగాహన కల్పించి, నమోదు చేయించేవారు. ఇందుకు గాను ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ సిబ్బందికి ప్రోత్సాహక నగదు కూడా అంజేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో విడుదల చేసిన అరకొర నిధులతో ఈ ఏడాది జనవరిలో మొక్కుబడిగా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని పశువులకు మాత్రమే బీమా చేసి చేతులు దులుపుకొంది. ఉదాహరణకు బేస్తవారిపేట మండలానికి 100 పశువులకు సరిపడా బడ్జెట్ కేటాయించారు. దీంతో ఒక్కో పశువైద్యశాల పరిధిలో 25 పశువులకు మాత్రమే బీమా చేయాల్సి వచ్చింది. మరి మిగిలిన పశువుల సంగతేమిటో పాలకులే సెలవివ్వాలి.
అడ్డగోలుగా నిబంధనలు
వివిధ ఘటనల్లో పశువులు, సన్నజీవాలను కోల్పోతున్న వారిని ఆదుకోవడానికి 2019కు ముందు ప్రభుత్వ పరంగా ఎలాంటి బీమా పథకం లేదు. ప్రైవేట్ బీమా పథకాలు చేయించుకున్నవారికి సైతం సదరు కంపెనీలు తమ చుట్టూ రెండేళ్లపాటు తిప్పుకొని అరకొరగా బీమా నిధులు జమచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా పశువుల బీమాకు శ్రీకారం చుట్టింది. కానీ ఏడాదిన్నర క్రితం గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పశువుల బీమా పథకంలో అడ్డగోలు నిబంధనలు చొప్పించి పాడి రైతుల ఆశలపై దారుణంగా దెబ్బకొట్టింది. ఉత్పాదక దశలో ఉన్న 2–10 ఏళ్ల వయసులోపు ఆవులు, 3–12 ఏళ్ల వయసు గేదెలకు, అలాగే ఏడాదిన్నర వయసున్న మేలు జాతి ఎద్దులు, దున్నలు, రెండేళ్లు పైబడిన ఎద్దులు, దున్నలు, నాటు ఆవులు, ఆరు నెలల పైబడిన మేకలు, గొర్రెలకు మాత్రమే బీమా వర్తిస్తుందని నిబంధనలు విధించింది. యజమాని ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టినా, ప్రైవేట్ ఏజెన్సీల్లో బీమా చేయించినా పథకం వర్తించదని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి పరిధిలోకి వచ్చే ప్రమాదాలకు బీమా సొమ్ము చెల్లించబోమని మెలికపెట్టింది. పదేళ్ల వయసు దాటిన ఎద్దులు, దున్నలకు, ఆరు నెలల్లోపు వయసు గొర్రెలు, మేకలకు, శాశ్వత అంగవైకల్యం కలిగిన పశువులకు బీమా వర్తించదని నిబంధన విధించడంతో పాడి రైతులు డీలా పడిపోయారు.
బీమా మొత్తం ప్రీమియం ప్రభుత్వ వాటా రైతు వాటా
15 వేలు 960 768 192
30 వేలు 1920 1536 384
గొర్రెలు, మేలకు 375 300 75
(రూ6 వేలకు)
వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరించేది. 20 శాతం మాత్రమే పశుపోషకులు చెల్లించేవారు. దేశీ ఆవులు, గేదెలు ఒక్కో దానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరించగా, పశుపోషకులు రూ.231, అలాగే ఎద్దులు, దున్నపోతులకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరించగా లబ్ధిదారులు రూ.116, గొర్రెలు, మేకలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.185 భరించగా లబ్ధిదారులు రూ.46 చెల్లంచేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క జీవం చనిపోయినా బీమా వర్తింపజేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో పశువుల బీమా ప్రీమియంను రెట్టింపు చేశారు.
పశు బీమా పథకానికి కూటమి సర్కారు సమాధి
బడ్జెట్‌లో అరకొర నిధులతో
కొన్ని పశువులకే బీమా
మొత్తం ప్రీమియం చెల్లించి బీమా
చేయించుకోండని అధికారుల సూచన
భారం మోయలేక బీమా పథకానికి దూరంగా ఉన్న రైతులు
కూటమి ప్రభుత్వంలో ఇలా.. ఒక్కో పశువుకు బీపీఎల్, ఎస్సీ, ఎస్టీలు చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు

పశువులంటే ప్రాణం.. బీమా ఇవ్వం!