
ఈతకు వెళ్లి యువకుడు మృతి
తాళ్లూరు: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని శివరాంపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు. గుమ్మడి ముత్యాలు, సుజాత కుమారుడు గుమ్మడి సన్నీ (20 ) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కావడంతో గ్రామంలోని కొంత మంది యువకులతో కలిసి పెద్దసాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో సన్నీ నీటిలో మునిగి మృతి చెందాడు. మృతునికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సింగరాయకొండ: దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్ 3వ లైనులో నివసిస్తున్న కొల్లా వినయ్‌పై ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఊళ్లపాలెంకు చెందిన కొల్లా సాయి చరణ్, జరుగుమల్లి మండలం సతుకుపాడు గ్రామానికి చెందిన బల్లికుర సుమంత్ దాడి చేశారు. బాధితుడు వినయ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇద్దరు నిందితులను శనివారం సాయంత్రం కందుకూరు ఫ్‌లైఓవర్ వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఒంగోలు టౌన్: నగరంలోని బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డు వద్ద అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను పోలీసులు పటుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసిన వ్యక్తిని కాదని అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్స్ రద్దు చేయాలని ప్యూచర్ ట్రేడ్స్‌కు చెందిన భరత్ ఇటీవల మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో ఇసుక అక్రమ విక్రయాల వ్యవహారం బట్టబయలైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నగరంలో అనధికారికంగా ఇసుక విక్రయిస్తున్న 20 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ సీఐ విజయకృష్ణ నిర్ధారించకపోవడం గమనార్హం.